పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రత్నవర్తకులకథ.

65

దని సంతసించుచు వర్తకులారా ! మీరు ప్రాణములు దక్కినవని సంతసింపక మూటలుపోయినవని విచారించెద రేమిటికి? మీ పెండ్లాముల మెడత్రాళ్ళు గట్టివి కనుక, బతికివచ్చితిరి. అది బ్రహ్మరాక్షసి. పగలు దివ్యరూపంబునఁ గనంబడుచు మార్గస్థుల భ్రమపెట్టి శృంగార చేష్టల వెలయింపుచు లోపలికిఁ బిలిచి చీఁకటిపడినతోడనే వారిం గడ తేర్చుచుండును. దానిబారి తప్పించుకొని మీరెట్లు వచ్చితిరో వింతగా నున్నది. రత్నములకాసపడి యాదెసకుఁ బోవుదురుచుఁడీ! ప్రాంతములఁ గాచికొనియుండి మీఁదఁబడి చంపఁగలదు. అని యెఱింగించిన విని వర్తకులు బాబూ! నీపుణ్యము. మంచిమాట తెలిపితివి. మావాఁడొకఁడు సొమ్మునకాసపడి పదుగుర వెంటఁబెట్టుకొని యక్కడకిఁ బోవలయునని చెప్పుచున్నాఁడు. బ్రతికియుండిన సొమ్ము వేరొకరీతి సంపాదించుకొనఁగలము. అని పలుకుచు వారు మఱియొక మార్గమునఁ దమదేశమునకుం బోయిరి.

గోమఠుండును వేగముగా నింటింకింబోయి భార్యనుబిలిచెను. ఆమె వచ్చి తలుపుదీసినది. అమ్మగువమొగముజూచి కన్నులట్లెఱ్ఱగా నున్న వేమి ? నిద్రపట్టలేదా? అని యడిగిన నప్పడఁతి బుడిబుడిదుఃఖ యభినయించుచు మనోహరా! మీవియోగంబున రాత్రి నేను పడిన పాటులు దైవ మెఱుంగును. ఆదిభయమో, విరహమో, పరితాపమో తెలియదు. కన్నులు మూతపడినవికావు. అని యేమేమో చెప్పుచుండ నతండు ఔను. నేనామాటయే యనుకొనుచుంటిని. ఇఁక నెన్నఁడు నిన్ను విడిచి పోవను. పోయినను రాత్రికిఁ దప్పక రాఁగలను. అని యూరడఁబలికెను. భార్య వంట చేయుచున్న సమయంబున నిల్లంతయు వెదకి వర్తకులమూటలు దాచినచోటు తెలిసికొనియెను. రాత్రిభోజ నానంతరమున జార వాడుకప్రకారము ప్రారంభకృత్యములు నిర్వర్తించిజలకమాడి నూత్నాంబరధారిణియై కలియవచ్చినంత నతండు భా