పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రత్నవర్తకులకథ.

63

లేకున్న నొంటరిగా నీయడవిలో నింత చక్కనిచిన్నది వసించునా ? వాఁడు చెప్పుచునే యు౦డెను. ఈవిసరు నామీఁద బడినది. వారుమువ్వురు దీనివేషముజూచి యీపాటికిఁ బారిపోయి ప్రాణములు దక్కించుకొని యుందురు. నాకే చావుమూఁడినది. నేఁడు మృత్యుదివసంబని యెఱుంగక లేచినవేళ మంచిదని ముఱిసితిని. అన్న న్నా! దైవమెంతలో దీర్పరానికష్టములు గలుగఁజేసెను. అక్కటా! విథీ! నీకంటికి నేనొక్కడను గనంబడితినా? ఈబ్రహ్మరాక్షసి నాపైబడి బలవంతమునఁ జంపునుగాఁబోలు. కటకటా! నాభార్య పోవలదనుచుండ నిల్లు బయలుదేరితిని. ఇది రమ్మనినతోడనే యాలోచించక తటాలున నేనే రావలయునా? చొర వెప్పుడును కూడదు. నామూటలో లక్షవెలగల రత్నములున్నవి. అవియన్నియు వాండ్రు తీసికొనిపోవుదురు కాబోలు! నా భార్యకిత్తురా ? ఈయరు. ఇది వారింగూడ భక్షింపక విడుచునా? ఏమో ముందు నేను జిక్కితినిగదా. అని తలపోయుచుఁ గదలకమెదలక నిట్టూర్పువిడువక దానిదెసఁజూడక యొంటిప్రాణముతోఁగూర్చుండెను.

అప్పు డప్పడతి బెడిదపునుడువు లడర ముమ్మారు మంచము వలగొని యిదిగో! వచ్చి నీపనిపట్టెదఁ గూర్చుండుమని పలుకుచు బెరటిలోనికి, బోయినది. ఆయంతరమరసివర్తకుఁడు మంచము మెల్లనదిగి తొంగితొంగిచూచుచుఁ జప్పుడుకాకుండ నడిచి పొంచిపొంచి యల్లన వర్తకులున్న గదిలోనికింబోయెను.

వానిరాక నిరీక్షించుచుఁ గన్నులమూయక యాదెసం జూచుచున్న మువ్వురువర్తకులు వానింజూచి లేచి ముందు నేనుబోయెద నేనుబోయెదనని ముందర కడుగు వేయఁబూనిరి. అప్పుడతండు వారి నాటంకపరచుచు నోరులుమూసి మెల్లగా నిది యాఁడుదికాదు. బ్రహ్మరాక్షసి. ఇందుండిన మనలనందఱఁ జంపఁగలదు. అని సంక్షేపముగా జెప్పెనో లేదో యెవనికివాఁరే యేమాటయం బలుకక యేమూటయుం