పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

కాల మందువసింపుము. నేనిప్పుడే వచ్చెదనని పలికి యవ్వలికిబోయినది. మంచముపైఁ గూర్చుండి యావర్తకుఁడు నాకీదివసం బెంతసుఖమైనది. అచ్చరవంటి మచ్చెకంటితో పచ్చవిల్తుని కేళిఁగూడఁ గల్గుచున్నది. ఈజెంత యెంతప్రోడయో కాక యింతలోఁ గ్రొత్తవానిఁగూడ యత్నించునా? నేను మంచిపనిఁ జేసితిని. రమ్మనఁగనే వాం డ్రాలోచించుచుండిరి. సాహసించి రాఁబట్టి తొలికలియకలు నాకు లభించు చున్నవి. నేను ధన్యుండ నని తలంచుచు నాచంచలాక్షి రాక నిరీక్షించుచుండెను.

వాకిటిగదిలోనున్న మువ్వురు నాజవ్వని పలుకులు తలపోయుచు నయ్యో! మనబుద్ధులింత సురిగిపోయినవేమి ? వానికున్న సాహసము మనకు లేకపోయెనుగదా! పాప మాపైదలి వచ్చి మీలో నెవ్వఁడో యొకఁడు రావలయునని కోరినదికాని వానిపేరుపెట్టి పిలిచినదా? మనదేతప్పు. ఆచొరవయే వానికా తెఱవం గూడ జేసినది. ఆకాంత మనకుఁగూడ వంతులు సూచించినది. కాని వాఁడంతటితో విడువఁడు. మనపని వట్టిదే. వాఁ డెప్పుడువచ్చునోయని నిద్రలేక గడియలు లెక్కపెట్టుకొనుచు నిందుఁ బరితపింపవలసినవారమే. అని విచారించుచు నిద్రబోక వానిరాక చూచుచుండిరి.

ఆజారయు, బెరటిలోనికిఁబోయిఁ వాడుకప్రకారము చింపినగుడ్డ గట్టుకొని మసిబూసుకొని మండుచున్న కుంపటి నెత్తిపై బెట్టుకొని బెత్తము వేపరొట్టయు గరంబులధరించి హుంకారపూర్వకముగా ---

క. కరచెద మ్రింగెదఁ బొడిచెద
   విరిచెద నిలునిలుమటంచు వెలఁది పడక మం
   దిరమున కరుదెంచెను భీ
   కరవేషముతోడ దానిఁగని యతఁడాత్మన్ .

అమ్మయ్యో! ఇది బ్రహ్మరాక్షసి; యెఱుఁగక మోసపోయితిని