పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

కానిమ్ము. మేడయెక్కి చూచుచుండెద. సాయంకాలములోపలఁ దెరువరి యెవ్వడైన నీదారిబోకుండునా; అని తలంచి మేడగోడ యెక్కి రాజమార్గ ముపలక్షించుచుండెను. అప్పుడు,

చ. నలువురు రత్నవర్తకు లనంతధనాఢ్యులు దాక్షిణాత్యుల
    వ్వలిపురి సంతకేగుచు జవంబున మార్గముదప్పి మారుత్రో
    వల నటకేగుదెంచి కడుభాసిలు నాయిలుసొంపు విస్మయం
    బలరఁగఁజూచుచుండఁ గని యాసఖి వారల సంభ్రమంబునన్.

ఆహా! నేఁడు నాయదృష్టము ఫలించినది. వీరినలువురతో నేఁటిరాత్రి నాలుగుజాములు క్రీడించి నన్నుఁ బీడించుచున్న పంచశరుం గృతార్ధుం గావించెద. నేఁటికి నాపతి వచ్చువేళ మిగిలిపోయినది. అని తలంచి యమ్మించుఁబోఁడి పంచమస్వరంబున నోహో! తెరువరులారా! ప్రొద్దుగ్రుంకఁబోవుచున్నది. దాపున గ్రామమేదియును లేదు. ఇందు రండు. సుఖనిద్రజెంది రేపు పోవుదురుగాక యని కేకలు పెట్టినది. బాటసారు లామాట లాలించి మోములెత్తి యత్తలోదరింగాంచి యీగేస్తురాలు మనలరమ్మని చీరుచున్నది. భోజునసదుపాయముచేయక మానదు. ఈరాత్రి యిందుఁబండుకొని ప్రొద్దున పోవుదమని యొకఁ డనిన మఱియొకఁడు నట్టడవిలో నొంటిగానున్న యీవాల్గంటిదరికివిమర్శింపక పోవరాదు. అది భూతమో దయ్యమో పిశాచమో బ్రహ్మ రాక్షసియో తెలియదు. అనుటయు నింకొకఁడు సీ! నీవెప్పుడు నిట్లే పలుకుచుందువు. చంద్రబింబమువలె నొప్పుచున్న యాచిన్నదానిమొగము చూచితివా? దయ్యము బ్రహ్మరాక్షసి యిట్లుండునా? గొప్పవారు జనసంపర్కము సహింపక వివిక్త దేశమున మేడలు గట్టుకొని సుఖింతురు. ఉపకారమునకై మనలఁ బిలుచుచుండ లేనిపోని శంకలు చేయుచున్నావు. చాలుచాలు. పోవుటయే కర్జమని పలికెను.

నాల్గవవాఁడు సుందరీ ! మేమందువచ్చుచున్నాము. తలుపులు