పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

చీ! చీ! యీపాడుగ్రామమున వసించుటకంటె హైన్యములేదు. ఈ సంబంధముదాటిన నిఁక పెండ్లికాదు జాతకములేదని చెప్పుడు. అవ్వలికిఁ బొండని కసరిపంపినది. సోమవర్మ మఱలవచ్చి అయ్యా జూతకమిప్పుడు కనంబడలేదు. అందలి విషయంబులు పిమ్మట మీకు విన్నవించెదను. మీరుత్తమకులజులని మీయాకారములేచెప్పుచున్నవి. మిమ్ముఁ జూచినదిమొదలు మావాండ్రకు మీతో సంబంధముచేయ వలయునని యున్నది. మీ యభిప్రాయమేమి? అని వలికెను.

అంతలో సోమవర్మభార్య యోరగానిలువంబడి అయ్యా ! యీయూరిలోనివారెల్ల మాకు విరోధులు. వారిమాట లేమియుమీరు నమ్మవలదు. మాపిల్ల చాల గుణవంతురాలు. రూపముచూచితిరిగదా. పదివేల వెలగల నగలున్నవి. ఇంతకన్నఁ జెప్పునదిలేదు. కొన్ని యిబ్బందులచేఁ బెండ్లికిఁ గాలము మీరినది. దీనికిఁ బదియేఁడులు మొన్ననే వెళ్ళినవి. గోవగానెదుగుటచే నట్లున్నది. మీకీయవలయునని యున్నది. తప్పక పెండ్లియాడి సుఖింపుఁడని పలికిన విని నవ్వుచు గోణికాపుత్రుఁడిట్లనియె.

అమ్మా! నేనిప్పుడు వివాహమాడను. ఈతఁడు నా శిష్యుఁడు వీని నిమిత్తమైమీపిల్ల నడుగవచ్చితిని మీరనినట్లీయూర నేవియో కొన్నిమాటలు జెప్పిరి. కాని, యవి పరిగణించువారముకాము. వీఁడు పాత్రుఁడు మీపిల్లను వీనికిచ్చి పెండ్లిచేయుఁడు. ఇతండనుమోదించు చున్నాఁడు. మీ యింట నిల్లరికముండఁగలఁ డని చెప్పెనో లేదో యా యిల్లాలు బాబూ ! ఎవ్వరైనమంచిదే. మాయింట నుండుమనియే మేము గోరుచుంటిమి. మీరు కోరిక తీర్చితిరి. సంతోషించితిమి. కాని లగ్నము వ్యవధిలేదు. రేపే మంచిముహూర్త మున్నదని చెప్పరి. తరువాత బంధువులందరు వత్తురుగాక. తప్పక రేపు వివాహముగావించుట కంగీకరింపవలయు నటునిటు మీరే పెండ్లిపెద్దలని చెప్పిన సంతసముతో నతం డంగీకరించెను.