పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

మనకు భాగ్యభోగ్యములు చాలగలిగియున్నవి. ఒక్కరితయు కూతురు అదియు విద్యారూపములచే హృద్యయైయున్నది. అట్టిపుత్రికకు వివాహము గావింపలేకుంటిమి ఇది స్వయంకృతాపరాధము. దాని మీరు జారిణియని వెల్లడింపకపోయినచో నీముప్పువచ్చునా? లోకములో నెందఱుకన్యకలు గలరు. అందఱు పతివ్రతలేయగుదురా? కన్యకతండ్రి యెవ్వఁడైన నిట్లుచెప్పుకొనునా? అయ్యయ్యో! మీరు వట్టియమాయకులైపోయితిరి. పిల్లకు యౌవనము పొడసూపుచున్నది. వరుఁడెవ్వఁడు దొరకకున్న వాఁడు. రజస్వలయైనచో గొంపనట్టేటిలోఁ గట్టికొనవలసినదేకదా? ఇప్పుఁడైన నడుగవచ్చినవారి కాగుట్టు చెప్పనని యొట్టు పెట్టుకొనుఁడు. ఇందులకు మాయన్న మిమ్ముఁ బెద్దగా నిందించు చున్నాఁడని మందలించిన నాలించి యావిరించికుల వతంసమిట్లనియె.

ఓసీ! దోసమెఱింగి చేసికొనిసపిమ్మటఁ బుత్రికను నిందింపరని చెప్పుచుంటిని. పోనిమ్ము బ్రహ్మసూత్రముతోడు ఇక నెవ్వరికిం జెప్పనని శపధముచేసెను. అడుగవచ్చినవారికెల్ల నాగ్రామస్థులు వారింటికి వెళ్ళకమున్నె యీవృత్తాంతము చెప్పుచుందురు.

గోణికాపుత్రుండును గోమఠుండును నయ్యగ్రహారము ప్రవేశించినతోడనే జారనడుగవచ్చినవారని నిశ్చయించి గ్రామస్థులు కొందఱు వారిం జేరి మీరు సోమవర్మకూఁతు నడుగవచ్చితిరికాఁబోలు. ఆపిల్ల మంచిదికాదుసుఁడీ యనియాకథ యంతయుఁజెప్పిరి. గోణికాపుత్రుఁడు నవ్వుచు గోమఠునిమొగము జూచెను. ఆర్యా! నేను బెండ్లికిమొగము వాచి యుంటిని. విధ్యాధనమనీషాశూన్యుండ నగు నాకు గన్యక నెవ్వరిత్తురు? సోమవర్మకూఁతురు జారయైన నగుంగాక. కులరూప విద్యావిభవంబుల నొప్పుచున్నదిగదా? స్త్రీసంపర్క రాహిత్య దుఃఖిత స్వాంతుండనగు నాకాపిల్ల నిప్పింపుఁడు పెండ్లియాడెదనని యడిగిన గోణికాపుత్రుం డిట్లనియె.