పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జార కథ.

51

అని పలికి భర్తనూరడించినది. పిమ్మటఁ దనతలిదండ్రులతో నామాట పరిహాసముగా ముచ్చటించినది. వారునవ్వుచు నాబాలికనెత్తుకొనినప్పుడెల్ల జారజారయని ముద్దులాడఁదొడంగిరి.

దానంజేసి యాబాలిక కాపేరేరూఢియైనది. అందఱును జార జారయని పిలుచుచుందురు. క్రమంబున నాబాలికారత్నము దినదిన ప్రవర్ధమానయై పదియేఁడులు ప్రాయము వచ్చునప్పటికి మనోహర రూపంబునఁ బ్రకాశింపుచుండెను. అప్పుడాబాలికకు వివాహముచేయవలయునని తలిదండ్రులకు తలంపుగలిగినది. తదీయకులరూప విద్యావిశేషముల విని యెవ్వరేని యయ్యిందువదన నడుగవచ్చి జారయను పేరు విని కారణమేమని యడిగిన సోమవర్మ నిజము మఱుఁగుపెట్టక యదార్ధము చెప్పుచుండును. ఆమాటవిని అక్కటా! కోడలు వ్యభిచరించినఁ గులముచెడును. అపకీర్తివచ్చును. సొమ్ముమాట దేవుఁడెఱుంగును. నీపిల్ల మాకక్కరలేదని వచ్చినవారెల్ల నిదిగో మఱలవత్తుమనిచెప్పి యేగుచుందురు కాని, యొక్కరైన నంగీకరించినవారు లేరు. మఱి రెండేడులు గతించినవి. అప్పుడు --

శ్లో॥ దృష్టి స్సాలసతాం బిభర్తి నశిశుక్రీడాసుబద్ధాదరా।
     శ్రోత్రేప్రేషయతి ప్రవర్తిత సఖీసంభోగవార్తాస్వపి।
     పుంసామంకమపేతశంక మధునా నారోహతిప్రాగ్యథా।
     బాలా నూతనయౌవనవ్యతిక రానష్టభ్యమానా శనైః॥

మ॥ అలసత్వంబుజనింపఁ జూపులను బాల్యక్రీడలందాదరం
       బెలమింబూనదు వీనులొగ్గి విను నిర్వృత్తప్రియాభోగవా
       ర్తలు కాంతల్ దమలోనఁ జేప్పుకొనఁ బూర్వంబున్వలెన్‌బూరుషా
       వళిమేనంటదు జంకి బాలిక నవప్రాయంబుమైఁబ్రాకగా?

ఆకన్యవార్త దేశమంతయు వ్యాపించుటచే నెవ్వరు నాకన్య నడుగరైరి. ఒకనాఁడు సోమవర్మభార్య భర్తతో వైదికోత్తమా