పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

బోఁదొడంగెను. ఇరువురుంగలిసి పోవుచు నొకనాఁడు విపులయను నగ్రహారమున కరిగిరి,

జారకథ.

అందు సోమవర్మయను దైవజ్ఞుఁడు గలఁడు. అతనికిమడిమాన్యములు చాలకలవు. జ్యోతిషములో నట్టిపండితుఁడు లేడని వాడుక వడసెను. అతండు తనజాతకమునుజూచికొని యంతర్దశలు సూక్ష్మదశలుప్రాణదశలు గట్టిగుణింపుచుండఁ జిరకాలమున కతనికొక యాఁడు పిల్లపుట్టినది. ఆజన్నిగట్టాపట్టికి జాతకర్మాదివిధులు నిర్వర్తించి సంతోషముతోఁ బంచాంగముజూచి పుట్టినవేళగుణించి లగ్నముగట్టి గ్రహబలముజూచి యేమియుంజెప్పక చిన్నవోయియున్న భర్తంజూచి వెఱపుతో భార్యయిట్లనియె.

ప్రాణేశ్వరా! మనపట్టి పుట్టినవేళ మంచిదేనా? ఆయుర్భాగ్యము లెట్లున్నవి? పంచాంగముజూచి వెలవెలబోవుచుంటిరేల? అనియడిగిన పత్నికిఁబతి యిట్లనియె. సాధ్వీ! నీకూఁతున కాయువు భాగ్యమును బాగుగనే యున్నది. అందులోపములేదు. కాని, స్త్రీలకు నుండఁదగని దోషమేదికలదో, దేనివలనఁ నన్నిగుణములు దూషితములగునో దేనివలన గులముచెడునో దేనివలన బంధువులలోఁ దలవంపుగలుగునో యట్టిజారత్వగుణముల నీబిడ్డ చెడ్డదైపోవును. ఇట్టిది పుట్టకపోటునం దీరిపోవునుగదా! నిష్కలంకమగు మాకులము కలంకిత మగునని చింతించుచుంటి. అనవుఁడు పకాలుననవ్వి యవ్విద్రుమోష్ఠి యిట్లనియె.

సరిసరి. ఇదియా మీవిచారము. చాలుచాలు. జ్యోతిషము జదివినందులకు మంచిలాభమేకలిగినది. పోనిండు పరీక్షించిచూడ స్త్రీలలో జారిణి కానిదెవ్వతె? వీలుకుదరమి నందఱునుందొడ్డవారే మీరుచదివికొంటిరేకాని లోకానుభవము లేనివారు. ఏదియో యని వెఱచితిని. కానిండు ఇది బ్రతికి బట్టగట్టినప్పుడు చూచుకొందములెండు.