పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గోణికాపుత్రుని కథ.

49

అయ్యా ! నావంటివాండ్రందఱు విద్వాంసులైనచో లోకము నిలువనే నిలువదు. ఇప్పుడు నాకుఁ జదువువచ్చునా? పెండ్లినిమిత్తమై యీబిచ్చమెత్తియే నాలుగు డబ్బులు ప్రోగుచేసితిని. అందుల కేప్రయత్నము జేయుచుంటిని బాబూ! మీవైపునఁ బిల్లలెవ్వరైన నుండిరా? అని యడిగిన గోణికాపుత్రుండు జిఱునగవుతోఁ బిల్లల కేమికొదవ? కావలసినంతమంది కలరు. కాని, పెండ్లియాడినచో నీకష్టము వాయు నా? అనుటయు వటుఁడు సందేహమేల?

గీ॥ భార్యయుండిన వనమైనఁ బట్టణంబు
     కాంతలేకున్న గృహమైనఁ గాననంబు
     ఆలులేకున్న విధినైన నధముడండ్రు
     భార్యమూలము గృహమని పలుక వినరొ !

గీ॥ ఎంతకష్టపడిన నింటికివచ్చి యి
     ల్లాలి మొగము జూచినపుడె తొలఁగు
     నిది యెఱింగికాదె ఋషులు వసిష్టాదు
     లును సభార్యులగుచు వినుతిగనిరి.

క॥ ఒడలంటఁ గాళ్ళు పిసుకఁగ
     గడివెడువేనీళ్ళ నీయఁ గంచము వెట్టన్
     బడకయమర్పఁగఁ జేతికి
     విడె మీయఁగ భార్యగాక వేరొకతగునే.

మహాత్మా! నాకుఁ జక్కనిభార్యతోఁ గాపురము సేయవలయునని చాలముచ్చటగా నున్నది. నీతేజముజూడ మహావిద్వాంసుఁడవు వలెఁ గనంబడుచుంటివి. నీకు శుశ్రూషగావింపుచు నీవెంటవత్తు. నాకుఁ బెండ్లి గావింపఁగలవా? అని యడిగిన గోణికాపుత్రుఁడు అట్లే రమ్ము. మంచికన్యక నరసి వివాహముసేసెద నింతియేకద! అని యంగీకరించెను. గోమఠుం డింటికిఁబోక యక్కడనుండియే యుతనివెంటఁ