పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

143 వ మజిలీ.

గోణికాపుత్రునికథ.

గోపా ! విను మాదత్త కాదిమిత్రులలో నొకండగు గోణికాపుత్రుండు నియమించికొనినప్రకారము శుభముహూర్తంబునఁ గాశీపురంబునుండి బయలుదేరి దక్షిణాభిముఖుండై యరుగుచుఁ గ్రమంబున ననేక జనపదంబుల తిక్రమించి యందలివిశేషములు పరికించుచు నొకనాఁడొక చెట్టునీడంగూర్చుండి యాతపసంజాతక్లేశంబు బోకార్పు కొనుచున్న సమయంబున నొకబ్రహ్మచారి యాదారింబోవుచు నా మ్రానునీడంజేరియందున్న గోణికాపుత్రుంగాంచి నమస్కరించుటయు నతండు నీవెవ్వండ, వెందలివాఁడ, వెందుబోవుచున్నవాఁడవని యడిగిన నావటుం డిట్లనియె.

అయ్యా ! నాదొక పల్లెటూరు కాపురము. నాపేరు గోమకుం డందురు బ్రాహ్మణుఁడ, దరిద్రుఁడనై ముష్టియెత్తుకొనుటకై యీ ప్రాంతగ్రామముల కరుగుచున్నాఁడ నని చెప్పిన నతండు నవ్వుచు నీకుఁ బెండ్లియైనదా? విద్యాభ్యాస మేమైన జేసితివా? అని యడిగెను.

చిన్నతనమునందే తలిదండ్రులు గతించిరి. సంసారము మీఁదబడినది. ముష్టియెత్తుకొని సంసారము నడుపుచుంటిని. చదుచుకొనుట కవకాశము గలిగినదికాదు. విద్యాధన శూన్యుండ నగునాకుఁ బిల్ల నెవ్వరిత్తురు? శుద్ధబ్రహ్మచారిని బాబూ! అని చెప్పిన గోణికాపుత్రుండు అయ్యయ్యో విద్యాభ్యాస సమంజసమగు కాలంబంతయు నీచపు బిచ్చమునకై వెచ్చబెట్టుచుంటివే! ఒక్క పొట్టకై యీముష్టియేమిటికి? ఇప్పుడైనఁ గాలము మిగులలేదు. బిచ్చముమాని చదువుకొనుమని పలికిన వటుం డిట్లనియె.