పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

52 సంపాఠ్యం॥ కల్పిజదువుట అనగా దా నెప్పుడు జదువనిదాని నొకరు జదువుచుండ వానితో నేకరువు బెట్టుట.

53 మానసి॥ ఒకఁడుమనసులోఁ దలచుకొని వ్యంజనములు మాత్రము పద్మదళాకృతులుగా వ్రాసినంత నతఁడు తలంచికొనిన శ్లోకఛందోగణాదులు తప్పకుండ వ్రాయుట. ఇది కవితాచమత్కృతి విషయము.

54 కావ్య క్రియా॥ సంస్కృత ప్రాకృతాపభ్రంశ కావ్యములు రచించుట.

55 అభిధానకోశః॥ అడిగిన వృత్తములరచించుట.

56 ఛందోజ్ఞానం॥ పింగళాది ప్రణీతములగు ఛందస్సుల నెఱుంగుట.

57 క్రియాకల్పః॥ కావ్యాలంకారముల నెఱుంగుట. ఈమూడును గావ్యాంగములు.

58 ఛలితకయోగాః॥ ఒకరూపమును మఱియొకరూపముగా మార్చి పరుల వ్యామోహపెట్టె యోగములు నెఱుంగుట.

59 వస్త్రగోపనాని॥ చిన్నది పెద్దదిగాను, పెద్దది చిన్నదిగాజేసి వస్త్రములు ధరించుట.

60 ద్యూతవిశేషాః॥ నిర్జీవద్యూతక్రీడల నెఱుంగుట.

61 ఆకర్షక్రీడా॥ పాచికననాడుట ఇదియుద్యూతక్రీడలలోనిదీ.

62 బాలక్రీడనకాని॥ బాలుర కుపయోగించు నాటవస్తువుల రచించుట.

63 వైనయికీనాం జ్ఞానం. గజాదిశిక్షణము.

64 వైజయికీనాం వ్యాయామికీనాంచ విద్యానాం జ్ఞానం విజయాచారశాస్త్రములు విజయ ప్రయోజనములగు శస్త్రవిద్యలు మృగయాప్రయోజనములగు విద్యలు దెలిసికొనుట

ఈయరువదినాల్గువిద్యలు నీశాస్త్రమున కవయవములై యొప్పుచున్నవి. వీనికే యంగవిద్యలనిపేరు.