పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

అరువదినాల్గువిద్యలు.

1 గీతం॥ స్వరగము, పతగము, లయగము, చేతోవధానగమని గానము, నాలుగువిధములు.

2 వాద్యం॥ ఘన వితత సుషిర కాంస్య తంత్రీప్రభుతుల వలనంగలుగునది.

3 నృత్యం॥ విభావానుభావాదుల వలన వ్యక్తమగునది.

4 ఆలేఖ్యం॥ రూపప్రమాణవర్ణికా సాదృశ్యాది షడంగములతో విగ్రహములు వ్రాయుట.

5 విశేషకచ్ఛేద్యం॥ భూర్జాదిపత్రములు ఛేదించి తిలకముగ గర్ణ పత్రములుగ రచించుట.

6 తండులకుసుమబలివికారాః॥ నానావిధంబులగు తండులములచే గామ దేవాది భవనమునం దలంకరించుట పుష్పములతోఁ గూర్చి శివలింగాదుల నర్చించుట.

7 పుష్పాస్తరణం॥ శయనగృహాదులయందుఁ బూవులచే శయ్యాదుల గల్పించుట

8 దశనవసనాంగరాగః॥ కుంకుమాదిరంజకములచే నోష్టాదులు రంగులు వైచికొనుట.

9 మణిభూమికాకర్మ॥ గ్రీష్మకాలంబునఁ జల్లదనంబునకై మరకతాది మణులచే వేదికలు గల్పించుట.

10 శయనరచనం॥ రక్తవిరక్త మధ్యస్థాభిప్రాయముల ననుసరించి యాహారపరిమితంబట్టియు శయ్యలరచించుట.

11 ఉదకవాద్యం॥ నీటియందు మురజాదులవలె వాయించుట.

12 ఉదకాఘాతః॥ హస్త యంత్రములవల్ల నుదకముల విరజిమ్మి కొట్టుట ఈరెండును జలక్రాడాంగములు.

13 చిత్రాశ్చయోగాః॥ ఇంద్రియపలితీకరణాదులైన చిత్రయోగములు ఇవి యితరుల వంచించుటకు నుపయుక్తములు.