పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రుక్మిణికథ.

35

శ్లో॥ పక్వాన్నమివ రాజేంద్ర సర్వసాధారణా స్త్రియః
     తస్మా త్తాసు న కుప్యేత న రజ్యేత రమేత చ॥
     మద్యపానా న్నివృత్తిశ్చ బ్రాహ్మణానాం గురోస్సుతాం
     పరస్త్రీభ్యశ్చ లోకానా మృషే రౌద్దాలకే రపి॥
     తతః పితు రనుజ్ఞాతా ద్గమ్యాగమ్యవ్యవస్థయా
     శ్వేతకేతు స్తపోనిష్ఠ స్సుఖం శాస్త్రం నిబద్ధవాన్ ॥

పూర్వకాలంబునఁ బరస్త్రీగమనము నిషేధముకాదు. స్త్రీలు పక్వాన్నమువంటివారు. అందరును సమానముగా ననుభవింపఁదగిన వారు. ఇది గమ్య ఇది యగమ్యయని విథినిషేధములులేవు. మఱియు బ్రాహ్మణులు మద్యమాంసములు దినువారు. గురుపుత్రికం బెండ్లియాడువారు. అట్టి దురాచారములన్నియు నిషేధించి పరమతపోనిష్టుండగు నుద్దాలకమహర్షి కుమారుఁడు శ్వేతకీతుండనువాఁడు తండ్రి యనుజ్ఞ చే (నపరదారాంగచ్చేత్) పరస్త్రీగమనము నిషేధించుచు సహస్రాధ్యాయములతో నొప్పుచున్న యొకశాస్త్రమును రచించెను. నాఁటినుండియు నాదురాచారము లన్నియు నశించినవి.

మఱియు నాగ్రంధవిషయంబులే క్లుప్తపరచి బభ్రుపుత్రుఁడగు పాంచాలుండను పండితుండు నూరధ్యాయములుగా సాధారణ సాంప్రయోగిక కన్యాసంప్రయుక్త భార్యాధికారిక పారదారిక వైశికోపనిషాదికములను సప్తాధికరణములుగల యీగ్రంధమును రచించెను. ఇందలి విషయంబులు సర్వజనానుష్ఠేయంబులని యెఱింగించి మఱియు,

ఇందు సూ - శతాయుర్వై పురుషో విభజ్య కాల మన్యోన్యానుబద్ధం పరస్పరస్య అనుపఘాతుకం త్రివర్గం సేవేత॥

పురుషుఁడు తన యాయువును విభజించుకొని ధర్మార్ధకామముల నొకదానివలన నొకదానికి బాధకములేకుండ ననుభవింపవలసినదని చెప్పఁబడియున్నది. చూచితివా

రాజపుత్రి - సఖీ! పురుషుఁడు తనయాయువునెట్లు పంచుకొనవలయునో చెప్పుము.