పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

రాజకుమారునిచిత్తము తదాయత్తమగుటఁ జిత్తభవునిసాయక ప్రవేశమున కవకాశమిచ్చినది. తదీయసంభాషణామృతము గోలుట. మేను వివశమైపోయినది. మోహమగ్గలమగుటయు నొడ లెఱుంగక సాత్వికవికారములతో వచ్చినపనియేమియో మఱచి యారాజకుమారుఁడు వికారముగా మాటలాడుచుండుటఁ దెలిసికొని రుక్మిణి అన్నా ! ఇఁక నీవిందుమసలరాదు. వేగఁబొమ్ము. చారుమతీ! లోపలికిఁబోవుదము రమ్మని యామెనంతర్భవమునకుఁ దీసికొనిపోయినది.

అప్పుడా నృపనందనుం డేమిచేయుటకుం దోచక రుక్మిణిపలికిన మాటలవడువున నందునిలువక చిత్తచాంచల్యముతో నిజనివాసమునకుంబోయెను.

అంతఃపురమునఁ జారుమతి రుక్మిణితో పట్టీ ! నీయన్న యెట్టి ప్రశ్నలు వైచెనో చూచితివా? ఎట్టివికారములఁ బ్రకటించెనో పరికించితివా? యౌవనవిలాసములు కడు విపరీతములుగదా ? అనుటయు రుక్మిణి సఖీ! పోనిమ్ము వానిగణింపకుము. అతండు నీవ్రతం బెఱుఁగకపోవచ్చును. నీరూపమందంత మహిమయున్నదని యామెమనసు చిన్నవోకుండ సవరించి మాటాడినది. పిమ్మట నాదినమందే మంచి సమయ ముపలక్షించి చారుమతి రుక్మిణీ! నీవిప్పుడు నావలనఁ దెలిసి కొనవలసినవిద్య లేమియో పేర్కొనుము. ఇప్పుడే ప్రారంభింతమని యడిగిన నమ్మగువ యేదియో యాలోచించుచుండెను. అప్పుడు రేవతి చెలీ! మఱచితివా ? నిన్న నుద్యానవనములో జూచుచున్న పుస్తకము పాఠము జెప్పించుకొనుము. అందలి విషయములు మనకు స్పష్టముగాఁ దెలియలేదు. అని జ్ఞాపకము సేయుటయు స్మృతి నభిన యించుచు నాయించుఁబోఁడి యాపుస్తకము దెప్పించి యాయొప్పులకుప్పకుఁ జూపుచు దీని నాకు సాంతముగాఁ బాఠము జెప్పుమని కోరినది. చారుమతియు నుపన్యాసపూర్వకముగా నిట్లు చెప్పఁదొడంగెను.