పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రుక్మిణికథ.

33

నిజము దెలిసికొనవచ్చెనని యెఱింగించుటయుఁ జారుమతి యారాజ సుతునకు నమస్కరించి యోరగానిలువంబడినది.

చిత్ర -- క॥ నారీ ! నీపేరేమది?

చారు -- చారుమతి యటండ్రు

చిత్ర - నీదు జననం బెచటో?

చారు - వారాణసి.

చిత్ర - కులమెయ్యది?

చారు -- వారాంగన నేను.

చిత్ర - కన్యవా?

చారు - అవు దేవా!

చిత్ర – గీ॥ విద్యలే మభ్యసించితివి?

చారు — నరనాథపుత్ర : శ్రీకాళిదాసాదిభూరికవిశిఖామణుల చేత విఖ్యాతిఁగనిన మీకడను జదివితిననుచుఁ జెప్పికొనఁగవశమె?

[క॥ నారీ నీపేరేమది?
      చారుమతియటండ్రు నీదుజననం బెచటో
      నా వారాణసి కులమెయ్యెది ?
      వారాంగననేను కన్యవా ? అవు దేవా.

గీ॥ విద్య లేమభ్యసించితివి నరనాధ
     పుత్ర కాళిదాసాదిభూరికవిశి
     ఖామణులచేత విఖ్యాతిగనిన మీక
     డను జదివితిననుచు జెప్పుకొనఁగ వశమె.]

చిత్ర. - క॥ లలనావతంసమా! నీకులవృత్తిని నేవగించుకొంటివి మేల్ పెండిలియాడెదవా!

చారు - యేమో ! తెలియదు. విధిపంపులకు విధేయులము గదా?