పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

మఱునాఁటియుదయంబున భోజకుమారుఁడు చిత్రసేనుఁడను వాఁడు రుక్మిణి యంతఃపురమునకు వచ్చి యొక్కచోఁ గూర్చుండి చెలియలింబిలిచి సహోదరీ! నిన్నసాయంకాలమున నీగుఱ్ఱమెక్కడికో పారిపోయినదనియు దానినెక్కి క్రొత్తవాఁడొకఁడు నీయుద్యానవనమునకు వచ్చెననియు వానిని బండిలో నెక్కించుకొని రాజభటులను గద్దించి నీవంతఃపురమునకుఁ దీసికొనివచ్చితివనియు నందున్న కావలి వారలు సెప్పుచున్నారు. మంత్రులావిషయము నీవలనం దెలిసికొని రమ్మని నన్నునియమించిరి. అందలియధార్థమేమనియడిగిన రుక్మిణి భయమభినయించుచు అన్నా ! కాశీపురనివాసిని చారుమతియను వేశ్యారత్నము మనయూరునకువచ్చుచు దారిలోనెదురుపడిన నాగుఱ్ఱ మెక్కినది. అది యెందునుబోక నాయుద్యానవనమునకుం దీసికొనివచ్చినది. అచిన్నది మిక్కిలి చదివినదఁట. ఆమెవలనఁ గొన్నివిద్యాసాంప్రదాయములఁ దెలిసికొనఁదలంచి నాశుద్దాంతమునకుఁ దీసికొనివచ్చితిని కావలివారలామెను మగవాఁడని బొంకుచున్నారు. కావలసిన నామె నిందుదీసికొనివచ్చి చూపెదఁ జూడుమనిపలుకుచు లోనికిఁబోయి చారుమతిపాణిఁ బాణింగీలించి ముచ్చటలాడుచు నచ్చటికిఁదీసికొనివచ్చి యీమెయే చారుమతి. ఈమెయేనిన్న నాగుఱ్ఱమెక్కి నాయుద్యాన వనములోనికి వచ్చినమచ్చెకంటియని యెఱింగించెను.

అప్పుడారాజకుమారుఁ డాజవరాలి మేనుజాళువామేనితళ్కు కన్నులకుమిఱుమిట్లుగొల్ప ముకుళితనయనుండై మోహావేశవివశుండై యొక్కింతతడవు ధ్యానించి మదినుదుటుగుదురుపడఁ జేసికొని తదీయ సౌందర్యాతిశయం బాపోవకచూచుచుండెను. రుక్మిణి చారుమతి సఖీ! ఈతఁడు నాసోదరుఁడు చిత్రసేనుఁడు; విద్వత్ప్రియుండు కొంత చదివినవాఁడు. కొదవవిద్యలు నీయొద్ద నేర్చుకొనఁగలఁడు. మఱియు మాయుద్యానవనరక్షకులు నీవు మగవాఁడవని నివేదించిరఁట. అందలి