పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రుక్మిణికథ.

31

రాపట్టితో నాకు మైత్రిగలిగినది. నావంటిధన్యురా లున్నదియా! అని పొగడుకొనుచుండ వారించుచు రుక్మిణి యిట్లనియె.

చారుమతీ! నీమాటలచేత నే నీవఖండపాండిత్యధురంధరురాలనని తెలియఁబడుచున్నది. నీవంటి యాప్తురాలు దొరకుట చర్ఘటము. ఈవాఱువము నిన్ను నాచేరువకుఁ దీసికొనివచ్చుట నాభాగ్యముగాని నీభాగ్యమా! నీవు నాయొద్దఁ గొంతకాలము వసింపవలయును. నిన్ను నాహృదయంబునం బెట్టికొని కాపాడెదను. నన్ను శిష్యురాలిగాభావించి నీకువచ్చిన విద్యయంతయు నాకునేర్పుము. సంతతము నాయంతఃపురమునందే వసింపుము. నాభాగ్యమే నీభాగ్యము. నాభోగమే నీభోగము అనిపలుకుచు నేస్తమభిలషించిన విని చారుమతి యిట్లనియె.

రాజపుత్రీ! నీవు నాకుఁ బ్రియురాలవై మెలంగెదననిన సంతసింపనా? నీయిష్టమెట్లో యట్లేకావించెద. మఱియొకటివినుము నేను గణికనైనను కులవృత్తినివిడిచితిని. మీవారెవ్వరైన నన్ను విటకత్తెనుగా భావింతురేమో. అందుల కంగీకరించుదానఁగాను అనుటయు రుక్మిణి నవ్వుచు పువ్వుఁబోడీ! నాయంతఃపురమునకుఁ బురుషులువత్తురా? నాకెట్టియవరోధమో నీకు నట్టియవరోథమే. సంశయింపకుము. రమ్ము, అని చేతిలోచెయ్యివైచి బండియెక్కించుకొని తసప్రక్కను గూర్చుండ బెట్టుకొనినది. రేవతియెదురుగాఁ గూర్చుండినది.

అప్పుడు కొందఱుపరిచారికలువచ్చి దేవీ! రాజభటులు ద్వార దేశమునఁ గోలాహలము సేయుచున్నారు. నీగుఱ్ఱమెక్కి యెవ్వఁడో పురుషుఁడు లోపలికివచ్చెనట వానింబట్టికొని దండింతురఁట. ఈవలకుఁ దింపుమనుచున్నారు. సెలవేమి? అనవుడు రుక్మిణి చాలుఁ జాలు వాండ్రవిమర్శనము జక్కగానున్నది. గుఱ్ఱమెక్కి వచ్చినది యాఁడుదో మగవాఁడో తెలియకున్నారు. పోపొమ్మనుము. అనిగద్దించి బండి తోలించుకొని తనయంతఃపురమునకరిగినది. ఆరాత్రి రుక్మిణి జూరుమతితో నిష్టగోష్ఠీవినోదముతోఁ దృతిగా వెల్లించినది.