పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

చ్చితివికావున నెచ్చెలివైతివి. రమ్ము రమ్ము. నీవృత్తాంతము చెప్పుము. అని పలికిన నక్కలికి యతిలాఘవంబున నాగుఱ్ఱమును దిగినది.

రాచపట్టి యామెచెట్టఁబట్టుకొని యందున్న రచ్చపైఁ గూర్చుండఁ బెట్టినది. అప్పుడా చిన్నది, రాచకన్యతో రమణీమణీ ! నాపేరు చారుమతియండ్రు. నేనొక వేశ్యాపుత్రి కను. కన్నవారు చిన్నఁనాడే గతించిరి. బంధువులచేఁ బోషింపఁబడి విద్యాభ్యాసలాలసనై కాశీపురంబున కరిగి యందు బహువిద్య లభ్యసించితిని దేశవిశేషంబులం జూడ వేడుకబడి తిరుగుచుంటి. నేఁడు నేనీ వీటికి వచ్చుచుండ నా కెదురుగా నీతురగము పరుగిడివచ్చుచుండెను. అడవిమెకమని వెఱచి దిట్టెక్కితిని. ఆచెట్టుక్రిందికే వచ్చి యిది నిలువంబడినది. ఉత్తమాశ్వమని గ్రహించి దీనిపై కెక్కి, లగాములో కాలుపెట్టితినో లేదో యొక్క పరుగున నిక్కడికిఁ దీసికొనివచ్చినది. దీనిపై నెట్లు నిలువబడితినో తెలియదు. ఆ వేగమునకు మేను వివశమైపోయినది. ఇదియే నావృత్తాంతము. నిన్నుఁజూడ రాజపుత్రికవలెఁ గనంబడుచుంటివి. నీపేరేమి ? ఏమహారాజు గూఁతురవు? ఈనగర మెయ్యది ? నీయుదంత మెఱింగించి శ్రోత్రానందము గావింపుము. అనుటయు రాజపుత్రిక సఖురాలు రేవతి యిట్లనియె.

ఈమె సకలనృపకిరీట మణిఘృణీనీరాజిత చరణసరోజుఁడగు భోజభూభుజుని కూఁతురు. ఈమెపేరు రుక్మిణి. ఇది ధారానగరము. ఇది యీమె విహరించు నుద్యానవనము, అని యెఱింగించినది. చారుమతి యామాటవిని వెఱగుపాటుతో నోహోహో ! 'నేఁడింత సుదినము నే నెంతధన్యురాలను నాయభీష్టము దీర్ప నీయశ్వము సర్వేశ్వరుని యనుమతినే నన్నిక్కడికిఁ దీసికొనివచ్చినది. సకలకల్పభూజుండగు భోజమహారాజుయశము కాశీదేశమంతయు వ్యాపించియున్నది. అట్టి