పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిత్రసమ్మేళనము.

397

సభ గావించిరి. వాఁడుచేసిన దుష్టక్రియలనెల్ల విమర్శింపుచు నిట్టిదుర్మార్గుఁడు జీవించియుండినచో లోకమున కపకారముజరుగునని నిశ్చయించి సామాజికులు వాని కురిశిక్ష యే విధించుట కర్జమని యేకవాక్యముగాఁ బలుకుటచేఁ బట్టణమంతయు నూరేగింపుచు నొకనాఁడు వాని నురిఁదీసిరి.

మఱియు నీసప్తమిత్రులును బ్రభుపుత్రుండగు పాంచాలునిచే క్లుప్తముగా రచింపఁబడిన కామశాస్త్రములోని సప్తాధికరణములు నొక్కొక్కటి నొక్కొక్కఁడు ప్రత్యేకముగా రచించిరి.

అందుఁ జారాయణుఁడు సాధారణాధికరణము సువర్ణ నాభుండు సాంప్రయోగికము ఘోటకముఖుండు కన్యాసంప్రయుక్తము గోనర్దీయుఁడు భార్యాధికారికము గోణికాపుత్రుండు పారదారికము దత్తకుండు వైశికాధికరణము కుచుమారుండు ఔపనిషదికమును వ్రాసి కామశాస్త్రప్రవక్తలలో నగ్రగణ్యులైరి.

చ. ఇరువురు రాజులైరి మఱియిద్దఱు రాజుల కల్లురైరి యొ
    క్కరుఁ డల రాజమిత్రుఁ డనఁగాఁ దగె నొక్కఁడు యక్షకన్యకం
    బరిణయమయ్యె శ్రోత్రియకుమారిక నొక్కఁడు బెండ్లియాడె నీ
    ధరఁ దగె సప్తమిత్రచరితంబు విచిత్రకథాస్పదంబుగాన్ .

గోపా ! (జామెతైవ స్ను షాభవత్) అల్లుఁడే కోడలయ్యెను. అని నీవడిగిన ప్రశ్నమునకు నీకథ సమాధానము జెప్పినదా? అనిచెప్పిన ముప్పిరిగొనుసంతోషముతో వాఁడు స్వామికి మ్రొక్కుచు మహాత్మా ! ఇట్టి గూఢార్థముగల యాశ్లోకము వారి కెట్లర్థమగును. రెండు మాటలతోఁ జెప్పెదరేమో పోయి వారి కాయర్థము చెప్పవలయునని తలంచితిని. ఆయ్యవసథంబు దాటి చాలదూరము వచ్చితిమి. పోనిండు మంచికథ వినుట తటస్థించినది. తలవనితలంపుగా భోజకాళిదాసకవుల కథలుగూడ నిందుఁ గూడినవని యుబ్బుచు నయ్యతిశిఖామణివెంటఁ గావడి మోయుచు నవ్వలిమజిలీ చేరెను.