పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

396

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

అప్పుడు భోజభూభుజుండు వారినందఱం గలయఁగనుఁగొని వారువారుపడిన కష్టములు తిరిగిన దేశములు చూచినవింతలు ప్రత్యేకముగా వెండియు నడిగి తెలిసికొని యో హెూ ! నేఁడు మహోత్సవ దివసము. వియోగముబొందినవారందఱము గలిసికొంటిమి. ఇట్టి సంతోషము గలుగఁజేయువాసరము మఱియొకటి యుండదు. అని యుపన్యసించుచు మీరందఱు నిదుండి నా కానందము గలుగఁజేయు చుండవలయును. గోనర్దీయకుచుమారులు రాజ్యభారవాహకులు కావున వచ్చుచుం బోవుచు నుందురు. యక్షుండు మాకుఁ బ్రత్యక్షదైవము. దర్శనపాత్రులముగాఁ జేయుచుండవలయునని ప్రార్థించుటయు నందుల కందఱు ననుమోదించిరి.

గోనర్దీయకుచుమారులు మారాజ్యములు మాయొక్కరివేకావు. మేమేడ్వురము పంచుకొనవలసినవారమే. మీమూలముననే మాకీయైశ్వర్యములు గలిగినవి. మిమ్ము మేము ప్రభువుగా మిత్రుగా దైవముగా భావించుకొనియుందుము. మీ రాజ్యము స్వరాజ్యముగానే యెంచికొందుమని తగురీతి నుత్తరము జెప్పిరి. అంతటితో సభ చాలించిరి.

భోజుండు లీలావతి నప్పుడే తనయంతఃపురమునకుఁ దీసికొని పోయెను. ఆమె పండిత కుటుంబమును వెంటఁబెట్టికొనిపోయి పెద్దగా నాదరించినది. అమ్మఱునాఁడే భోజుండు దత్తకుఁడు తనకు జామాతయని ప్రకటింపుచు వివాహమహోత్సవవిశేషములు నిర్వర్తించెను. దత్తుఁడు చిత్రసేనను రెండవభార్యగా స్వీకరించెను. గోణికాపుత్రుండు విద్యారూపశీలసంపన్నయగు తదాస్థానకవి శంకరునిపుత్రికం బెండ్లియాడి రతిమంజరిని రెండవభార్యగాఁ గైకొనియెను యక్షుండు రత్నపదికతో మూఁడునెల లయ్యుత్సవవిశేషముల నానందించుచుఁ బిమ్మటఁ దమశైలమునకుం బోయెను.

భైరవున కెట్టిశిక్ష విధింపవలయునని మఱియొకనాఁడు గొప్ప