పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిత్రసమ్మేళనము.

395

తఃపురమునకుఁ దీసికొనిపోవుట తప్పుగాదుగదా? దౌవారికులమాట విని నీకుమారుఁడు నన్నుఁ బరీక్షింపవచ్చుటయు న్యాయమే. న న్నతండు మోహింప నాయింగితమువడువున నతని మందలించుటయు సమంజసమే. శాపాంతమున నేను బురుషుండనై యంగాంగమేళనం బొనరించి యున్న నన్నుఁ బతిగావరించుట యేమితప్పో చెప్పుఁడు. అని తనయుదంతమంతయు నెఱింగించి రుక్మిణి నిర్దోషురాలని యెల్లరకుఁ దెలియునట్లుపన్యసించెను.

అప్పుడు భోజుండు పుత్రికంజేరఁదీసి గారవించుచుఁ దల్లీ ! నీ విందులకు వగవంబనిలేదు. అప్రయత్నముగనే జగత్పూజ్యుండగు పండితుఁడు నీకు భర్తయయ్యె. ఇది నీయదృష్టము. అని బుజ్జగించిపలుకుచుఁ గూఁతునకుఁ బ్రీతిఁగలుగఁజేసెను. పిమ్మట రత్నపదిక వచ్చి యక్షునకు మ్రొక్కుచు వియోగదుఃఖమును బ్రకటించుచు నతనిమన్ననలం బడసినది.

తరువాత మల్లికవచ్చి తల్లిదండ్రులం గౌఁగిలించికొని దుఃఖించుచుఁ దనకు యక్షదంపతులు గావించిన యాదరణము లుగ్గడించుచుఁ బతిముఖనిహితదృష్టియైయున్నంత భోజభూపతి యాసతీతిలకము పాండిత్యమహత్వము గవిత్వప్రౌఢియు ననన్యసాధారణములని స్తుతియించెను.

అప్పుడు రతిమంజరీచిత్రసేనలు వచ్చి వారిముంగట నిలువంబడుటయు గోణికాపుత్రుండు వారుపడినయిడుములన్నియు నుగ్గడింపుచు పెద్దగా నగ్గించెను. దత్తుం డామత్తకాశినులం జూచుచు నోహో ! నా బాల్యస్నేహితురాలు చిత్రసేనయే. అయ్యో! ! నానిమిత్త మెన్నికష్టముల పాల్పడితివి ? ఎట్టియైశ్వర్యము విడిచివచ్చితివి. అని కొనియాడుచుఁ దత్కాలోచితములగు మాటలచే నయ్యోషలకు సంతోషము గలుగఁజేసెను.