పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

394

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

యొకటి యుండదు. అని పలుకుచుండఁగనే యాప్రాంతమందుండి యా యుపన్యాసమువినుచున్న లీలావతి హా! ప్రాణనాథా ! నేను ధన్యురాల ధన్యురాల. నీచే నిట్లు స్మరింపబడుచుంటినని పలుకుచు నతని పాదంబులం బడినది. భోజుండు ప్రమోదకంటకితశరీరుండై సంతోషాశ్రువులచేఁ దచ్ఛిరంబుఁ దడుపుచు లేవనెత్తి పెద్దగా గారవించుచుఁ దాను జేసినతప్పు మన్నింపుమని వేఁడుకొనియెను. అప్పుడు లీలావతి,

క. పతి తన్ను సుగుణవతి యని
   స్తుతియించుటకంటెఁ గలదె సుందరికిఁ బ్రియం
   బతులవ్రతములు దానము
   లతిశయముగఁ జేయుసుకృత మగుఁ బతి మెచ్చన్ .

మీరు నన్నిందఱిలో మెచ్చికొనుటచే నేను ధన్యురాలనైతిని. ఈపండితులు నాకు సోదరులై యాదరించిరి. యక్షుండు తండ్రియై రక్షించె. యక్షకాంతలు తల్లులై మన్నించిరని తనవృత్తాంత మంతయు నెఱింగించినది. అంతలో రాజపుత్రికయగు రుక్మిణియు పాదకటకంబులు ఘల్లురనిమ్రోయ నల్లన తల్లివెనుక వారినికటంబునకుఁ బోయి భర్తకు మ్రొక్కి తండ్రికి నమస్కరించి పండితులకుఁ గేలుమోడ్చి యేదియో చెప్పఁదలంచి సిగ్గుచే మాటరాక దత్తకునిమో ముపలక్షించుటయు నాసన్న యెఱిఁగి యాపండితుఁడు లేచి యిట్లనియె.

మహారాజా ! భగవంతుని యఘటితఘటనాసామర్ధ్యము మీకు వేఱ చెప్పనక్కఱలేదు. నేను యక్షశాపదుఃఖితుండనై యెందో పోవుచుండ నీమెగఱ్ఱము కళ్లెముద్రెంచికొని నాకడకు వచ్చుట భగవత్ప్రేరితముగాదా ? అది మీయశ్వమని యెఱుంగక యెక్కితిని. ఆ హయంబు రయంబున నీమెయుద్యానవనమునకుఁ దీసికొనివచ్చుటకు దాని నేఁ దోలితినా? నేను శాపంబునఁ జేసి యాఁడుదాననైతినని యీమె యేమియు నెఱుంగదు. విద్యాగ్రహణలాలసయై నన్నుఁ దన యం