పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/401

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

392

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

యక్షపత్ని భర్తంజూచి నిలువలేక హా ప్రాణనాథా ! అని పిలుచుచు బయటకుఁ బోఁదొడంగినది. సరస్వతి వారి వారించినది.

రుక్మిణి లీలావతితో నమ్మా! ఆతఁడే నాభర్త. అన్నన్నా ! యెంతయో వెదకించితిని. ఇక్కడి కెట్లువచ్చిరో తెలియదని చెప్పిన విని లీలావతి యావిశేషములన్నియుం జూచుచుండుటంబట్టి తెలిసికొని పుత్రీ ! నీయదృష్టము ఫలించినది. నా కంతయుం దెల్లమైనది. నీభర్త దత్తకుఁడు యక్షశాపంబున నాఁడుదియై నీతో స్నేహముసేసెను. సంవత్సరము ముగిసినతరువాతఁ బురుషుఁడయ్యెను. యక్షశైలవృత్తాంతము సువర్ణపదికకుఁ జెప్పుటచేఁ దిరిగి స్త్రీయైపోయెను. మీయన్న చిత్రసేనుఁ డామెను స్వీకరించెను. ఇప్పుడు కాళిదాసకవీంద్రుఁ డావిషయమై (జామాతైవస్ను షా భవత్ ) అని శ్లోకముగాఁ జదివెను. నీవు వినలేదు. నీబుద్ధి యీదత్తునిమీఁద నున్నది. తరువాత గోణికాపుత్రుఁడు వచ్చి కపటదత్తుని దీసికొనిపోయి యక్షునిచే శాపనివృత్తి గావింపఁజేసికొనియెను. ఇదియే వీనిరహస్యము. నీవువరించినవాని ప్రతిబింబము జూచి సువర్ణ నాభుఁడు నాఁడే దత్తుఁడని చెప్పెను. అని యావిశేషములన్నియుం జెప్పినది.

అమ్మయ్యో ! ఇదియా కారణము ? తల్లీ ! నారహస్యము సభలో వెల్లడియైనదాయేమి ? ఈసంగతివిని మాతండ్రిగా రేమనిరి? సభ్యులు పరిహాసమాడిరా ? నే నాదెస జూడలేదు. అని రుక్మిణి యడిగిన నీవు చేసినపని తప్పుకాదు. నిజ మెఱింగి వారే సమాధానపడియెదరని తల్లి యోదార్చినది.

భోజుండు వారివారి చరిత్రములన్నియు విని యందఱం గౌరవించుచుఁ దగిననెలవులు నియమించి పంపి తా నాకాళిదాసకవితోఁగూడ పండితకవులవెంట వారినివాసముల కరిగెను. రుక్మిఱిప్రభృతి యువతులును వారివెనుకనే యానివాసదేశంబు జేరిరి. భైరవుం గట్టిపెట్టి రాజుభటులు కారాగారంబునం బెట్టిరి.