పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిత్రసమ్మేళనము.

391

మన్మధునిబోలియున్న దత్తకుఁడు భోజరాజపుత్రికకు గర్భము చేసి యక్షశాపమువలన నాడుదియై చిత్రసేనునకు భార్యగానున్న వాఁడు. అందువలన నల్లుఁడే కోడలయ్యెనని సమస్య పూర్తిచేసెను.

ఆశ్లోకమును విని యందఱు తెల్ల తెల్లఁబోయి చూచుచుండిరి. రాజుగారికి బాగుగా విడిపోయినదికాదు. అప్పుడు గోణికాపుత్రుఁడు సంతోష మభినయించుచుఁ బెద్దయెలుఁగున నాకుఁ దెలిసినది. ఈరహస్యము నాకుఁ దెలిసినది. అని కేకలుపెట్టుచు మనము చూచినవాఁడే దత్తుఁడు. స్త్రీరూపముతో నుండి చిత్రసేనునిప్రోత్సాహమునఁ బురుషవేషము వైచికొని వచ్చెను. శాపాభిభూతుండగుట పూర్వస్మృతి లేదు. అని యారహస్య మెఱిఁగించెను. అప్పుడు రాజపుత్రునివెనుక నొదిగియున్న చారుమతిం బట్టుకొని గోణికాపుత్రుఁడు యక్షునొద్దకుఁ దీసికొనివచ్చి వీఁడే మామిత్రుఁడు. నీశాపమున నిట్లున్నవాఁడు. శాపవిమోచనము గావింపుమని ప్రార్థించెను. అప్పుడు యక్షుం డీశ్లోకమును జదివెను.

శ్లో॥ కాంతాస్యజ్ఞానతఃపూర్వం మద్రహస్య ప్రశంసనాత్
      కాళిదాస ప్రసాదేన పురుషోభవదత్తక ॥

అని చదువుచుండఁగనే అదేవేషము అదేరూపము వెలయ నాదత్తుం డున్మత్తత వదలి నిజరూపవిద్యాపాటవంబులు దేటపడ నోహో హెూ ! నామిత్రులందఱు నిందేయున్నారు. ఎప్పుడు వచ్చితిరి? నే నింత దనుక నిద్రఁబోవుచున్నానుకాఁబోలు నేమియు జ్ఞాపకములేదేమి ? అని యడిగెను.

మిత్రులందఱు నతనిం గౌఁగిలించుకొని సౌహార్దము దెలుపుచు నీయక్షకాళిదాసులమూలమున నీయాపద దాటితివి. నీవృత్తాంతము చాలఁగలదు. ఆనక దెల్పెదము అని తత్సమయోచితముగా సంభాషించిరి.

తెరలోనుండి మల్లిక తల్లిదండ్రులఁ జూచి నిలువలేక అమ్మా! తండ్రీ ! అమ్మా ! అమ్మా ! అని యఱనచుచు నీవలకు రాఁబోయినది.