పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

390

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

మెలసి తిరుగుచు మా కుపకారములు గావించితివి. ఎల్లకాలము కృతజ్ఞుల మైయుండెదము. నీదయలేకున్నఁ జారాయణుఁడు భైరవునికిఁ బిండివంటయైపోయెడివాఁడే యని స్తుతిఁజేయుటయు యక్షుండు మహారాజూ ! మేము మిమ్ముంజూచుటకై మిక్కిలి యుత్సాహమందుచుంటిమి. కాళిదాసవిరచిత మేఘసందేశము వినినదిమొదలు నా కాకవియందు నత్యంత భక్తివిశ్వాసములు గలిగినవి. దైవికముగా దత్తుఁడు మాయింటికి రాఁబట్టి యిందఱఁజూచుభాగ్యము పట్టిందని చెప్పఁగా నతండే కాళిదాసకవి, యేమియు నెఱుఁగనివాఁడుబోలె నందుఁ గూర్చున్న వాఁడని చూపిన యక్షుండు వోయి యతనిపాదంబులఁబడి స్తుతియిుంపుచుండెను.

ఆసందడిలో గోణికాపుత్రుఁడు చిత్రసేనునొద్దకుఁ బోయి పురుషవేషముతోనున్న చారుమతిం జూచి ఇడిగో మనదత్తుఁడు దత్తుఁడు అని కేకపెట్టెను. అందఱు నచ్చటికివచ్చి చూచి మిత్రమా! మాటాడవేమి ? ఇందు రహస్యముగాఁ గూర్చుంటివేల ? అని యడుగుచుండ నెవరికిని సమాధానముజెప్పక రాజపుత్రుని మఱుఁగఁజేరెను.

అప్పుడు సువర్ణ నాభుండు వీఁడు దత్తుఁడగాఁడు. పోలిక యట్లున్నది. దత్తుఁడు స్త్రీరూపముతోఁ దిరుగుచున్నాఁడు, యక్షశాపముమాట మఱచితిమి. వానినే పట్టుకొనవలసియున్నది. అనిపలుకుచుఁ గాళిదాసుతోముచ్చటించుచున్న యక్షునితో మహాత్మా ! నీవలన మా కనేకోపకారములు జరగినవి. దత్తునిఁ బురుషుని జేయవా? యెందున్నవాఁడో చెప్పవా ? అనియడిగిన యక్షుఁడు కాళిదాసుం జూపుచు మాచరిత్రము చూడకయే రచించిన మహాభావుండు మనచెంత నుండఁగ, దత్తుఁ డెం దుండెనో నేను జెప్పవలయునా ? ఆతఁడే యెఱింగింపఁగలడు అని ముకుళిత కరకమలుండై ప్రార్థించినఁ గాళిదాసకవి ముసిముసినగవులు నవ్వుచు రాజుగారి మొగము జూచుచు నీక్రిందిశ్లోకము చదివెను.

శ్లో॥ దత్తకో పుత్రికాగర్భ దత్తకో చిత్తజోపమః
     యక్షశాపాభిభూతస్తె జామాతైవ స్నుషా భవత్॥