పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిత్రసమ్మేళనము.

389

సువర్ణ నాభుందు సమీపించి మహాత్మా! నన్నెఱుంగుదువా? సువర్ణ పదిక భర్తను సువర్ణ నాంభుడ. మావదినయు నిందేయున్నదని పలుకుచుఁ గౌఁగిలించుకొనియెను. ఈసభ యెవ్వరిది ? నే నిక్కడి కెట్టువచ్చితిని ? అని యడిగిన సువర్ణనాభుండు ఇది భోజరాజుగారిసభ. అతఁడే మహారాజు. అతఁడే కాళిదాసు. వారే నామిత్రులు. వీఁడే భైరవుండు బంధింపఁ బడెను.

అని యావృత్తాంతమంతయు నెఱింగించుటయు నాయక్షుండు చేతులెత్తి భోజకాళిదాసకవులకు నమస్కరించుచు చారాయణునితో వారందఱు సేమమా భైరవుని బంధించుట లోకోపకారము. మల్లికతల్లి దండ్రులు వచ్చిరా ? అనుచుండఁగ నే బ్రహ్మదత్తుఁడును భార్యయు నందు వచ్చి తమకథ యెఱింగించిరి. మల్లికయు నందేయున్న దని విని ప్రహర్షపులకితగాత్రులై భోజునకుఁ దమ్మెఱింగించి భైరవుఁడు గావించిన యవమానము దెలియఁజేసిరి. భైరవవంచితులగు వారినెల్ల భోజుండు ఆదరించి పీఠస్థులఁ గావించి వారివారివృత్తాంతము లడిగి తెలిసికొనియెను. ఆకథలు విని సభ్యులు నాటకముచూచినదానికన్న నెక్కుడుగాసంతోషించిరి. సువర్ణ నాభుండు యక్షుంజూపుచు నీతఁడే మనకు పరమోపకారి. ఈతఁడే మన కెల్ల వంద్యుఁడు. అని యాతనికథ యెఱింగించుచు మనకాళిదాసకవి యీదంపతులకథయే మేఘసందేశముగా రచించెనని చెప్పెను.

అప్పుడు భోజుండుయక్షునిఁ బెద్దగాగౌరవించుచు ఘోటకముఖునితో జనాంతికముగా నిందు లీలావతి లేదేమి ? అని యడిగిన నవ్వుచు మహారాజా ! లీలావతి నంతకుముందే యక్షుండు రక్షించెను. మీవీట మామిత్రులయింట నున్నది. మీయభిమత మెఱింగింపవలయునని వారు నిరీక్షించుచున్నారని యాకథ యెఱింగించెను. అప్పుడు భోజుండు యక్షుం గౌఁగిలించుకొని మహాత్మా ! నీవు మనుష్యాతీతుఁడవు. మాతోఁ గలిసి