పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

388

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

పాపాత్ముండవు. చీ! మూఢా ! నీమొగముచూడ మహాపాతకమని నిందింపుచుండ ఘోటకముఖుం డరుదెంచి యేమిరా ద్రోహీ ! నాఁడు ఆడుదానిం జెఱపట్టితివి జ్ఞాపకమున్నదా ? అని నిందించెను అట్లు తలయొకమాటయాడి తిట్టుచుండ వాఁ డేమిచేయుటకుం దోఁచక ఇదిగో వచ్చెదనని యొకమూలనుండి వెళ్ళఁబోయిన గోఁతు లాటంకపఱచినవి. కుక్కలు తఱిమినవి. గుఱ్ఱములు తన్నినవి. వాఁ డిటునటు పరుగులిడుచుండ సామాజికులు నవ్వసాగిరి.

అప్పుడు కుచుమారునిచేఁ జెప్పఁబడి యొకభల్లూకము వాని నొకచెంపకాయ గొట్టి జుట్టుపట్టికొని వంచి లాగికొనివచ్చి కుచుమారుని పాదమూలమునఁ బడవేసినది.

కుచుమారుఁడు వానిశిరము కాలితోఁ దన్నుచు గురుద్రోహీ ! పరమతపోనిధియగు నాసిద్ధుం బరిమార్చి యేమిమూటఁగట్టుకొంటివి ? యముఁడు నీ నిమిత్తమై క్రొత్తనరకము గట్టించుచున్నాఁడు. పదపద. నీ విఁక నీభూమిలో నుండఁదగినవాఁడవు కావు. ఎందఱనెన్నిద్రోహములు సేసితివి. సీ ! సీ ! కీటకాదులలోఁగూడ నీవంటి నీచజన్మములేదని మీఁద నుమ్మి వైచి బాలీశా ! ఈమృగములన్ని యు నెవ్వరో నిజముజెప్పుము. లేకున్న నిదిగో మృగములచేత నీపనిపట్టించెదనని పలికిన వాఁ డేమియు మాటాడక జీవచ్ఛవములాగున పడియుండెను.

అప్పుడు వానిపాదములకుఁ జేతులకు నిగళములు దగిలింపఁ జేసి మృగములన్నిటినిఁ బరిశీలించి మెడలలోఁ గట్టఁబడియున్న తాయెత్తుల లాగివైచినంతఁ గొన్ని పురుషులుఁ గొన్ని స్త్రీలునై, నిలువంబడినవి. సభ్యులెల్లరు విస్మయముజెంది చూచుచుండిరి. అప్పుడు వారు అంబా ! తాతా ! అక్కా ! అన్నా ! అని యాక్రోశించుచుండిరి.

వారిలో యక్షుండు నలుమూలలు సూచుచు దీపప్రభావిశేషముల కచ్చెరువందుచు నది స్వర్గమాయని విభ్రాంతిఁ జెందుచుండ