పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

386

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

రత్నపదిక - ముందు వాఁడును వానివెనుక మృగము లాసన్నని దారివెంబడి యావువెనుక లేగలువచ్చుచున్నట్లు వచ్చుచున్నవి. వానిఁ గఱవవుకాఁబోలు!

మల్లిక – బాబో ! పెద్దపులులు సింహములుగూడ వానివెంట దూడలులాగున వచ్చుచున్నవి. వానిఁ జంపవుకాఁబోలు !

సువర్ణ పదిక - కఱచినచోమనవంటివాఁడే, కఱవకుండుటయేవింత.

మల్లిక - అక్కా ! చూడు చూడు. చేతితో బెత్తముబట్టుకొని యెటుత్రిప్పిన నామృగము లటుతిరిగి యాడుచున్నవి.

సరస్వతి - కుచుమారునిముందఱ వీనియాటలు సాగవు ఇప్పు డేమిచేయునో చూడుము.

మల్లిక - ఏమి మీభర్తగారిబడాయి ! మీతో నేమిచేయుదు నని చెప్పిరి ?

సరస్వతి -- ఒక్క మృగమునైన వానికిఁ జెప్పినట్లు వినకుండఁ జేయుదురు. చూచుచుండుఁడు.

రత్న పదిక - మీభర్తకారుణ్యమున మావారు బంధవిముక్తులయ్యెనేని చాల సంతోషింతుముగదా !

మదయంతి - అక్కా ! నీభర్తగారిమెడలోఁ దెల్లగా మెఱయుచున్న దదేమి ?

సరస్వతి — అదియే యాసిద్ధుని యజ్ఞమాల, దానిమూలమున మంచిచమత్కారము జరగును చూచుచుండుము.

మదయంతి - అది సింహముకాఁబోలు. తోకయాడించుచుఁ గుక్కవలె వానివెనువెంటఁ దిరుగుచున్నది ఇంతకుము న్నిట్టియాటలు పెక్కులు చూచితిమి. క్రూరమృగముల బోనులలోఁబెట్టి తీసికొనివచ్చువారు. ముహూర్తకాలము నిలిపి యంతలోఁ దీసికొనిపోవుచుందు రిది కడు చోద్యముగానే యున్నది. అయ్యో ! అక్కా ! చూడు మా సింహముపైఁ గరిపోత మెక్కి యాడుచున్నది.