పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిత్రసమ్మేళనము.

385

సాటిరారనుకొందును.

సరస్వతి — మహిమమాట జెప్పలేను కాని విద్యలకుఁ దీసి పోవరు.

రత్నపదిక — అమ్మయ్యో ! ఆమహానుభావునకు సాటి మూఁడు లోకములలో లేరని చెప్పఁగలను. మాహృద్గతాభిప్రాయములఁగూడఁ జూచినట్లు వర్ణించెను.

రుక్మిణి – అదియే యాకవిశిరోమణియందున్న విశేషము. ఎంత రహస్యమైనవిషయమైనను సమస్యగా నిచ్చినచో యథార్థము తెలియునట్లు పూర్తిచేయును.

సరస్వతి - అది దైవశక్తి, పాండిత్యప్రగల్భము కాదు.

రుక్మి -- రేవతీ ! మాయన్న యాపండితులతోఁ గలిసి కూర్చుండక మారుమూలగాఁ కూర్చుండెనేమీ ?

రేవతి - ఏమో తెలియదు. తండ్రిగారియొద్ద భయముకాదా ?

రుక్మిణి – ఆతనిప్రక్కఁ గూర్చున్నపురుషుఁడు మన మెఱిఁగియున్నవాఁడుంబోలెఁ గనంబడుచున్నాఁడు. చూడుము.

రేవతి - అగునగు నతఁడే నీహృదయచోరుఁడు.

రుక్మిణి — (జనాంతికముగా) ఈయాట ముగియులోపల నందుఁ జని వానివృత్తాంత మరసి రావలయును.

రేవతి - అట్లే పోయివచ్చెద, నదిగో గంట మ్రోగుచున్నది. మృగములతో వాఁడు ప్రవేశించునుగాఁబోలు.

మల్లిక - అడిగో అడిగో మెడలకుఁ దొడలకుఁ జేతులకు గంటలు గట్టికొని వచ్చుచున్నాఁడు. వాఁడేకాఁబోలు భైరవుఁడు. అగును. వాఁడె వాఁడె నాఁడు చూచితిని. గడ్డము జటలు పెంచుకొని యున్నాఁడు వాఁడే. ఓరీ ! క్రూరాత్ముఁడా ! నాతలిదండ్రుల నేమృగము చేసితివో చెప్పరా ! అని నిందించుచున్నది.