పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మిత్రసమ్మేళనము.

383

బురుషవేషమువైచి యాయాటకుఁ దీసికొనిపోయి మారుమూలగాఁ గూర్చుండెను.

భోజుండును గాళిదాసకవితోఁగూడ నియమితకాలమునకు స్యందనమెక్కి యాపండితులున్న మందిరమునకుఁ బోయి వీధిని నిలువంబడి లోపలికి వర్తమానముపంపెను. స్త్రీలను బ్రత్యేకముగాఁ దీసికొనిరమ్మని గోణికాపుత్రునకు నియమించి తక్కినవారు భోజకాళిదాసకవుల ననుగమించి రంగస్థలమున కరిగిరి. అందుఁగూర్చున్న వెంటనే తన్నుఁ జూచి చిఱునగవు మొగంబున వెలయింపుచున్న ఘోటకముఖుంజూచి భోజుండు ఓహోహో ! వీరెవ్వరు? నావెంటఁ బెక్కులు చిక్కులు పడుచు దేశాటనము గావించిన పరమోపకారి ఘోటకముఖులా ? ఎప్పుడువచ్చితిరి? అని లేచి యాలింగనము సేసికొనియెను. మీ రాపదగుడిచియుండ లేచిపోయిన కృతఘ్నుఁడ ఘోటకముఖుఁడనే. ఆపాపాత్మునిచేతిలోఁ బడితి రెట్లు తప్పించికొని వచ్చితిరి ? అనియడిగిన నిప్పు డేమియు మాటాడవలదు వీఁడే యాక్రూరాత్ముఁడు. వీనిం బంధించునిమిత్తమే యీయాటఁ బెట్టితిమి. అంతయుఁ దరువాతఁ జెప్పెదఁ జూచు చుండుమని తత్కాలోచితములగు మాటలచే నతనికి సంతోషము గలుగఁజేసెను.

భోజునకు వామభాగమునఁ గాళిదాసకవియుఁ గుడివైపునఁ గుచుమారుఁడును దరువాతఁ దక్కినవారుం గూర్చుండిరి. స్త్రీలు గూర్చున్న చోటునకు దాపునఁ జిత్రసేనుఁడు పురుషవేషముతోనున్న చారుమతితోఁ గూర్చుండెను. విద్యుద్దీపములచే రంగస్థలమంతయుఁ బట్టపగలువలె నొప్పుచుండెను. స్త్రీలకుఁ బురుషులందఱుఁ గనంబడుదురు. రాజ భార్య లెవ్వరును రాలేదు. రుక్మిణిమాత్రము రేవతితో వచ్చి లీలావతి ప్రక్కను గూర్చున్నది రాజకుటుంబమువారిందప్ప నితరుల నాయఱలోనికి రానీయరు. లీలావతి భర్తనుఁ గాళిదాసకవిని జూచి నమస్కరింపుచు,