పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదాలసకథ.

381

కాదనఁగలనా ? నీయిష్టమెట్లో యట్లే కావింపుమని తెలిపితిని.

ఆమెవోయి యల్లున కవ్విధం బెఱింగింప నతండు నాసవిధమున కరుగుదెంచి యార్యా ! యాచ్నా భంగదోషంబు గలుగునని యింత దనుక నాయభిలాష వెల్లడించితినికాను. ఇప్పుడు కులజులతోఁగూడ నేను గృతార్థుఁడనైతి. నాకూఁతుం బరిగ్రహింపఁ బాత్రుండవని స్తుతియింపుచు శుభముహూర్తంబున జాంబవతి నాకిచ్చి వివాహము గావించెను. తగినకన్యకదొరకినప్పు డొండొరుల ననుమతిబడయకయే వివాహమాడవచ్చునని మనము మొదట నిశ్చయించుకొంటిమి. కనుక మీ రెవ్వరును లేకున్నను మీయనుమతి పడయక జాంబవతిం బరిగ్రహించితిని. దివ్యోపభోగంబు లనుభవింపుచుఁ గొన్నిదినంబు లందుంటిని. అప్పుడప్పుడు పోయి గణికాపుత్రికలతో మాట్లాడి వచ్చుచుంటిని. వాండ్రు తమ్ము మీయొద్దకుఁ దీసికొనిపొమ్మని బ్రతిమాలికొనుచుండిరి. జాంబవతికి నందున్న సమయము సంగీతవి శేషంబులనెల్ల నెఱిఁగించిరి.

నే నొకనాఁ డానృపతితోఁ జెప్పి యొప్పించి చిత్రసేనారతిమంజరుల వెంటఁబెట్టికొని బయలుదేరితిని. సముద్రముదాటువఱకుఁ బెక్కండ్రుపరిజనులు తోడవచ్చిరి. దేశవిశేషములం జూచికొనుచు నీ నగరంబు నిన్న రాత్రికిఁ జేరితిమి. రాత్రి సత్రములో బసజేసితిమి. మీ పేరులు రాత్రి యాసత్రములోనే వినంబడినవి. నేఁటియుదయమున లేచి వీరిని బండియెక్కించి మీయునికిఁ దెలిసికొనుచు నిందువచ్చితిమి. ఇదియే నావృత్తాంతమని ఘోటకముఖుం డెఱింగించెను.

ఆవృత్తాంతమును విని మిత్రులందఱు సంతసించుచు ఘోటకముఖుండుగూడఁ బ్రభుస్థాన మలంకరింపఁగలఁడని ప్రశంసించిరి. అప్పుడు కుచుమారుఁడు నాఁడు నీతో వచ్చిన పురుషుఁడెవ్వఁడో నీ వెఱుఁగ వైతివి. అతఁడే భోజమహారాజు. అతుండు భైరవునితంత్రములోఁ జిక్కికొనియె నని చెప్పితివి. ఎట్లు బయల్పడియెనో తెలియదు. మాతో నావిషయ