పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/389

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

380

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

విచారించి దుఃఖము గలుగఁజేసితినేని వైరాగ్యము జెందఁగలఁడని నిశ్చయించి నిన్నిట్లాశ్రయించితిని. నీవును నాయభీష్టముపడువునఁ గావించితివి. మాతమ్ముఁడు ప్రవృత్తిమార్గము విడిచి విరక్తుండై యుత్తమ మార్గ మవలంబించె నిదియె నాయభీష్టము. తలఁచినకార్య మైనదని చెప్పిన నతండు తదీయవిజ్ఞానప్రవృత్తినిగఱించి పెద్దగా స్తుతిజేసెను.

అలర్కుండును జ్యేష్ఠపుత్రు ధాత్రీరాజ్యపట్టభద్రుం గావించి యన్నతో తపోవనంబునకుఁ బోయెనని యావృత్తాంతమంతయు నెఱింగించి మిత్రవింద యామదాలసవంటిదని స్తుతియించితిని. ఆకథవిని మిత్రవిందయు నవ్వయు వెఱఁగుపడి మదుపన్యాసము పెద్దగా మెచ్చుకొనిరి.

మిత్రవింద మదాలసగుణములోఁ దనకు సహస్రాంశమైనలేదని పలికినది. నేను వారితోఁ గలిసిమెలిసి యిష్టాలాపములాడుచుఁ గొన్నిదినంబు లందుండి యిచ్చటికిఁ బయనమైతిని. ఒకనాఁడు అవ్వ నాకడకు వచ్చి ముచ్చటింపుచు నిట్లనియె. ఘోటకముఖా ! నీముఖము జూచినప్పుడే దైవికముగా నామనుమరాలిని నీ కిప్పింపవలయునని బుద్ధిపుట్టినది. అందులకే నీకు నాగుట్టు జూపితిని. అందుల కే ని న్నిచ్చటికిఁ దీసికొని వచ్చితిని. నాకూఁతురు కూఁతు నీకిచ్చుట కంగీకరించినది. అల్లునకు నచ్చఁజెప్పితిని. అందఱకు నిష్టముగానున్నది. పెండ్లికూఁతురు నీవిద్యా వైభవము చూచి యుఱ్ఱూటలూగుచున్నది. కావున జాంబవతి నీవు ధర్మపత్నిగాఁ బరిగ్రహింపుము. ఈదీవి కధిపతి కాఁగలవు. నాయల్లుఁడు నీయభిప్రాయము దెలిసికొనిరమ్మనియెనని చెప్పినది.

జాంబవతిం జూచినదిమొదలు నాహృదయము దానియందు లగ్నమైయున్నది. వారు నాకుఁజేయు నుపచారములంబట్టి యించుక యాసదీపింప సంశయడోలిక యెక్కి యూఁగుచుంటిని. అవ్వ నాసందియము తీర్చినది. మనంబునంబొడమిన సంతసము దెలియనీయక మందహాసముతో నవ్వా ! నీవు పెద్దదానవు. నాశ్రేయము కోరుచుంటివి. నీమాట