పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

గంధర్వదౌహిత్రియగు నారాజపుత్రికసౌందర్యం బనన్యసామాన్యంబై యున్నదని వేరె వర్ణింపనవసరములేదు. ఆమె విహరించుటకై యాపట్టణంబును జేర్చియే గొప్పయుద్యానవనమొకటి నిర్మింపఁబడినది. ఆ తోటలోఁగల పుష్పజాతులు నందనవనములోఁ గూడ లేవని చెప్పవచ్చును. వాని చుట్టును గొప్పబ్రహరి గట్టఁబడియున్నది. సంతతము ఆరుక్మిణి యాయుద్యానవనమునందె విహరించుచుండును. ఆనిష్కు టములోనికిఁ బురుషు లెవ్వరుం బోరాదు. పోయినచో శిక్షింపఁబడుదురు. రుక్మిణికి యౌవనోదయమగుచున్నది. ఆతోటలోనే యాబోటి యాటపాటలు ఘోటకవిహారములులోనగు క్రీడలు గావింపుచుండును రేవతియను చెలికత్తియ యత్తన్వికి హృదయస్థానమై యున్నది. ఒక నాఁడారుక్మిణి యుద్యానవనములో సఖులతో నాడియాడి సాయంకాలమున స్వారివెడల వేడుకపడి రేవంతింజీరి సఖీ ! పరిచారిక గుఱ్ఱమును దీసికొనివచ్చినది కాదేమి? నేఁడు వాహ్యాళి లేదనుకొనినదాయేమి ? అనియడిగిన రేవతీదేవీ ! పరిచారిక యధాకాలమునకే తత్తడినాయత్తముజేసి తీసికొనివచ్చినదఁట. అది యకారణముగ బెదరి కళ్ళెము బట్టుకొని యెంతలాగినను నిలువక రెక్కలుగలదానివలె నెగిరి కళ్ళేము ద్రెంచుకొని యెక్కడికో పారిపోయినదఁట. దానికొఱకై పెక్కండ్రు రాజభటులు పరుగిడిపోయిరి. దాని జాడ యేమియుం దెలియలేదు. ఆమాట చెప్పుటకే నీదాపునకువచ్చితిని. నీవేదియో పుస్తకము జదివి కొనుచు నా దెసజూచితివికావు. ఇక వాహ్యాళికిఁ బ్రొద్దులేదు. రేపు గావింపవచ్చును. మిగుల దీక్షగాఁజూచుచున్న యాపొత్తములోని చిత్రములేమని యడిగిన రాజపుత్రిక రేవతికిట్లనియె.

ఈపుస్తకములో మిక్కిలి చమత్కారములగు విషయము లున్నవి. ఇది రహస్యగ్రంథము. దీనిపేరు చెప్పకూడదు. ఇవి స్పష్టముగా నర్ధము గాకున్నది. చూడుమని యాపుస్తకము రేవతికి నందిచ్చినది.