పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజునికథ.

27

ఈపాతక మాభూపతింజెందదా? అన్నన్నా ! చేతఁ గరవాలము లేక పోయెగదా? పండితప్రవరా ! పరోపకారపారీణు నిన్నావంచకుండు కుక్కచేఁ గరపించెనా? ఏదీ ! నీవ్రణము. అయ్యో ! దానికోఱలు లోతుగానేదిగినవి. గాయమింకను బచ్చిగనే యున్నది. వాఁడెం దేగెనో నాకు జూపుము. అని పలుకుచుండ ఘోటకముఖుఁడు ఓహో ! ఈతండెవ్వఁడో గొప్పవాఁడు. తేజశ్శాలి. పరాక్రమసంపన్నుండు. శ్రీరాముండువలె భార్య నడవికనిపి పిమ్మటఁ బశ్చాత్తాపము జెంది యయ్యిందువదనను వెదకుచున్నవాఁడు. నిక్కము దెలిసినది. ఆచిన్నది వీనిభార్య. పాపము ఆమెను వాఁడు చెరఁబట్టఁబోవ బలవన్మరణము నొందకమానదు. ఈదంపతులకిఁక కలయికదుర్ఘటమే. ఈతనివెంటఁ బోయి కులశీలనామంబులం దెలిసికొనెదంగాకయని తలంచుచు నతండానృపతికిట్లనియె.

అయ్యా ! నేను వారినిమిత్తము పెద్దదూరము తిరిగి వెదకితిని. ఎందునుగనంబడలేదు. ఆక్రూరునినొసటఁ బెద్దకుంకుమబొట్టున్నది. గడ్డముపెంచెను. జడలుముడివేయుఁబడియున్నవి. వాఁడీపాటికి జనపదంబులకుఁ బోవఁగలఁడు. నేను వాని గురుతుపట్టఁగలను. మనమీయడవి విడిచి గ్రామములమీదుగాఁబోయి వెదుకుదము. కనంబడక యెందు బోగలఁడు. అనియుపదేశించిన సంతసించుచు నాఱేఁడు ఘోటకముఖునితోఁ గూడ వానివెదకుచు దేశసంచారము గావించెను.

అని యెఱిగించి మణిసిద్ధుండు తదనంతరోదంతం బిట్లుచెప్పఁ దొడంగెను.

148 వ మజిలీ.

-◆ రుక్మిణికధ. ◆-

భోజరాజునకుఁ గంధర్వపుత్రికయగు కమలయను భార్యయందు జీత్రసేనుఁడను కుమారుఁడును రుక్మిణియను కుమార్తెయునుదయించిరి.