పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

లములఁ జేతనిడికొనివచ్చుచు మా కెదురుపడియెను. వాని చేతిలో నున్న దృష్టజంతువులనుఁ జూచి నేను జడియుచు నాయిల్లాలిని దరికిరమ్మని మార్గమునకోరగా నిలువఁబడి వాఁ డవ్వలికి బోవునని నిరీక్షించుచుంటిమి. ఆదుర్మాగుఁ డాచిన్న దానిమొగ మెగాదిగఁ జూచుచు నామెను తన దాపునకురమ్మని యంగుళితో సంజ్ఞఁగావించెను. ఆమె వాని మొగమే చూడలేదు. తరువాత నాతండాచిన్న దాని దాపునకు వచ్చి నీ వెవ్వతెవు? ఎందు బోవుచుంటివని యడిగిన జడియుచు నా యువతి నామాటునకు రాఁదొడంగినది.

నే నడ్డమునిలిచి అయ్యా ! మాజోక్యము నీ కేటికి ? నీదారినీవు బొమ్ము. ఈమె నాకు సహోదరి. మేము బ్రాహ్మణులము. నేనుండ నాఁడుదానిం బల్కరించెద వేమిటికి? అని చెప్పితిని. అతండు నామాటలు విని తలయూచుచు బాపురే! బాపనయ్యా! నిలునిలు. అనిపలుకుచు నొకకుక్క గొలుసువిప్పి నాపైకుసిగొల్పెను అది మొఱగుచు వచ్చి నాపైఁబడినది. నాకుధైర్యముచాలక పారిపోయితిని. కుక్క నన్ను తరిమి కాలుకఱచినది. నేలంబడితిని. మేను వివశమునొందినది. పెద్ద తడువునకుఁ దెలివివచ్చినది. నలుమూలలు చూచినంత నందెవ్వరును గనంబడలేదు. అమెకొఱకు పెద్దదూరము తిరిగితిని. ఏజాడయుం తెలియలేదు. తిరిగితిరిగి విసిగి మఱలమార్గంబునంబడి నడచుచుంటిని. ఇదేయే వృత్తాంతమని చెప్పెను.

ఆకథవిని భోజుండు హా! ప్రేయసీ ! నీ కెట్టి యిడుమలందెచ్చి పెట్టితిని నేనుమిగుల పాపాత్ముండఁగదాయని దుఃఖించుచుఁ గొంతసేపటికి ధైర్యముదెచ్చికొని మాంత్రికునుద్దేశించి చీ ! దుష్టాత్మా ! ఎవఁడవురా నీవు ! కాంతారముల సంచరించుచు సాధుజనులకు బాధ గావింపుచుంటివి? నాకన్నులంబడిన నిన్ను బ్రదుకనిత్తునా ? ఈరాజ్య మెవ్వనిది ? ఇట్టిఘోరకృత్యములు జరగుచుండఁ బరీక్షింపకుండెనే ?