పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజుని కథ.

25

నంతరాయములు గలుగుట నాలశ్యమైనది అనిచెప్పిన నతండిట్లనియె.

అయ్యా! ఈయడవిలో నెందైన నొక యాడుది గనంబడినదా! యని యడిగిన నతండు సౌమ్యా ! కనంబడినది. ఆమె మూలముననే నాకు జాగైనది. అని చెప్పుటయు నతండులేచి ఎందుఁ గనంబడినదో చెప్పుము. నన్నచ్చటికిఁ దీసికొనిపొమ్మని బ్రతిమాలిన బ్రాహ్మణుం డిట్లనియె.

నే నొకదారింబడి వచ్చుచుండ నొకచోఁ జుట్టుకొమ్మకుఁ బైటచెరఁగు తగిలించి మెడ కురిఁబోసికొని చావఁ బ్రయత్నించుచున్న యొకచిన్నది నాకన్నులంబడినది. కన్నులుమూసికొని చేతులుజోడించి దైవమును ధ్యానించుచున్నది. తటాలున నేనప్పుడుపోయి యుఱి బిగియకుండ గట్టిగఁ బట్టికొని స్వాధీ ! నీవెవ్వతెవు? బలవన్మరణము నొందుచుంటివేమిటికి? ఇది పాపకృత్యముకదా ! నీ కేమి యాపదవచ్చినది? నిన్నుఁజూడ గొప్పదానవువలెఁ దోచుచున్నావు. నీయుదంత బెఱింగింపుమని యడిగిన నాచేడియ గన్నులుదెరచి నన్నుఁజూచి ఆర్యా! నీకు నమస్కారము. నన్ను విడువుము. నావృత్తాంత మడుగకుము. పట్టు వదలుము. అని బ్రతిమాలినది.

నేను — తల్లీ! నీవృత్తాంతము నాకుఁ జెప్పుము. నన్ను బుత్రునిగా భావింపుము. బలవన్మరణము నొందఁగూడదని యెంతయో బ్రతిమాలితిని. నామాటలచే మరణోద్యోగము మానినదిగాని తనవృత్తాంతము చెప్పినదికాదు. అప్పుడు నే నామెనేమిఁయుఁ బల్కరింపక తెరపికిఁ బోవుదము రమ్ము. మీయూరికిఁ దీసికొనిపోయెదను. అని పలుకుచు నుపలాలించి యొక దారింబెట్టి నడపింపసాగితిని.

నే నామెవంకఁ జూచుచు రమ్మనిచీరుచు నిలువంబడి పరికించుచుఁ గొంతదూరము తీసికొనిపోయితిని. ఆదారి నొకమాంత్రికుఁడు భల్లూకములను కోఁతులను కుక్కలను మెడకుఁద్రాళ్ళుదగిలించి నాజా