పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

378

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

మనుభవింపుచుంటిని. ఈభూతపంచకమునకు సుఖాసుఖంబులన నెట్టివి? శరీరమే నేనుకానిచో తజ్జన్యములగు సుఖదుఃఖములు నా కెట్లుకలిగెడిని? తెలియకయే యిట్లుపలికితిని. నేను శరీరముకంటె భిన్నుండననిన నీ రాజ్యముతో నా కేమిసంబంధమున్నది. కావున నాకు శత్రుఁడును మిత్రుఁడును లేఁడు. సుఖము దుఃఖము లేదు. పురము కోశము దుర్గము లేదు. ఘటీకుంభక మండలుగతంబగు నాకాశ మొక్క టేయై పెక్కురీతులఁ గాన్పించునట్లు సుబాహుఁడు కాశీపతియు నేనునుంగూడ శరీరములచే భిన్నులముగాని యాత్మచే నొక్కరమే. మునీంద్రా! నీకరుణావిశేషంబునం జేసి నాయజ్ఞానంబు బాసినది. సంసారంబు మమత్వమూలంబని తెలిసికొంటినని పలికిన విని దత్తాత్రేయుం డిట్లనియె.

వత్సా ! నాప్రశ్నవలననే నీకు జ్ఞాన ముదయించినది. నీవనినట్లు సంసారమునకు మమత్వమే మూలమైయున్నది. ఈసంసారవృక్షమునకు నేను అనుమాటయే విత్తనము. నాదియనుట మొదలు. గృహ క్షేత్రాదులు శాఖలు. దారపుత్రాదులు పల్లవములు. ధనధాన్యాదిక మాకులు. పుణ్యపాపములు పూవులు. దఃఖములు ఫలంబులు. విధిత్సయే భృంగపంక్తి. మూఢసంపర్కము నీరుపోత. ఈతరువు హృదయంబున మొలిచియున్నది. దీనిం బ్రాజ్ఞులు జ్ఞానకుఠారంబున నఱుకుదురు. అని దత్తాత్రేయుం డతనికి విజ్ఞానప్రకారంబంతయు నెఱింగించెను. మఱియు యోగప్రవృత్తి ప్రాణాయామలక్షణము అణిమాదిసిద్ధులు యోగధర్మములు ప్రణవలక్షణము లోనగు విశేషములన్నియు నా మహాత్ము నడిగి తెలిసికొని యలర్కుండు తదామంత్రణంబువడసి సుబాహుండు గాశీరాజు నున్న చోటికింబోయి నవ్వుచు సోదరుండు వినఁ గాశీపతి కిట్లనియెను.

కాశీంద్రా ! రాజ్యకాముకుఁడవై వచ్చితివి. నీయిచ్చవచ్చిన ట్లనుభవింపుము. లేదా సుబాహునకిమ్ము. అద్దాని నేను విడిచితినని పలికిన