పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదాలసకథ.

373

భూతములు భూతములనే మర్దించును. అమూర్తు నెట్లు మర్ధింపఁగలరు. కావున మీరుపెట్టిన మూఁడుపేరులు నర్థశూన్యములైనవికావా ? నేను బెట్టిన వ్యవహారిక నామమున కర్థమేమిటికి ? అలర్కుఁడని సంజ్ఞార్థమే యుంచఁబడినది. అని యుక్తియుక్తముగా ననువదించిన విని యాభూపాలుండు సంతసించుచు మదాలస వైదుష్యమును బెద్దగా మెచ్చుకొనియెను.

మదాలసయు నాబాలునకుఁగూడ వెనుకటిబాలురకువలె జోలపాడుట జూచి కువలయాశ్వుండు తరుణీమణీ ! ఇదియేమికర్మము? నాకు సంతతిలేకుండఁ జేసెదవాయేమి ? ముగ్గురపిల్లలను సన్యాసులఁ జేసి యడవుల కనిపితివి. ఒక్కనినైన నుండనీయవా ?

నీకు నామాట వినుతలంపు గలదేని నా కిష్టముగా నీబిడ్డకు రాజనీతి యుపదేశింపుము. కర్మమార్గప్రవర్తకునిగాఁ జేయుము పితృదేవతలు తిలోదకములంది వంశాభివృద్ధి గోరుచుందురు. గృహస్థుండు సర్వజనోపకారి కాడే. కావున నాకుఁ బ్రీతిగా వీనికి రాజధద్మముల నెఱింగించి ప్రవృత్తిమార్గనిరతుం జేయుమని కోరినఁ బతివచనమును ద్రోయఁజాలక యంగీకరించి యమ్మించుఁబోఁడి యలగ్కున కిట్లుజోలపాడినది,

పుత్రా ! నీతండ్రికి సంతోషముగానఁ గర్మల నాచరింపుము. మిత్రుల కుపకారముచేయుము. శత్రువుల పీచమడంచుము. శత్రుశూన్యుఁడవై యేకాతపత్రముగా భూమి పాలింపుము. న్యాయముగాఁ బ్రజలఁ బాలింతువేని సుఖోపభోగ్యంబగు ధర్మఫల మందఁగలవు పర్వములయందు బ్రాహ్మణుల నర్చించి ధనప్రదానమునఁ దృప్తి బొందింపుము, బంధువుల కోరికలు తీర్పుము. సర్వదా పరహితమును గోరుచుండుము. పరస్త్రీలదెసకు మనసు పోనీయకుము. జన్నములు గావించి దేవతలను భూమిదేవతలను నాశ్రితులను దృప్తినొందింపుము. వీరుఁడా ! యుద్ధములచే శత్రువులను కామములచే స్త్రీలను సంతోషపెట్టఁగలవు.