పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

372

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

దినదినాభివృద్ధి వహింపుచుండఁ బెద్దవానికివలె వీనికిని దత్వోపదేశము గావించి ప్రాయమురాఁగానే తపోవనంబున కరుగఁజేసినది. తరువాత మూఁడవసంతానమున కతఁడు అరిమర్దనుడని పేరుపెట్టుచుండ నవ్వుచు నాపూవుంబోఁడి వానికిని దత్వంబెఱిఁగించి విరక్తుంగావించినది. పిమ్మట నాలుగవకుమారుం డుదయించెను. వానికి నేదో పేరుపెట్టఁబోవుచుఁ గువలయాశ్వుం డించుక నవ్వువెలయింపుచున్నమదాలసంజూచి ప్రేయసీ! నేను బేరుపెట్టినప్పుడెల్ల నవ్వుచుంటివి. విక్రాంతుఁడనియు సుబాహుఁడనియు నరిమర్దనుఁడనియు శోభస్కరములైన నామములు పెట్టితినని తలంచుచుంటిని. క్షత్రబంధువుల కీపేరులు యోగ్యములైయున్నవి. పరాక్రమమును సూచించుచున్నవి. వీనిగుఱించి యెందులకు నవ్వితివో చెప్పుము. మఱియు నీనాలుగవబాలున కేమిపేరుపెట్టెదవో నీవే నిరూపింపుము. నేనుగూడ నవ్వి పరిహాసము సేయలేనేమో చూతము. అనిపలికినవిని మదాలస మహారాజా ! నీయాజ్ఞ వడువునఁ గావించెదను. వీని కలర్కుఁడని పేరుపెట్టితి నట్లె లోకమున వాడుకబొందఁగలఁడని పలికినఁ గువలయాశ్వుండు పకపకనవ్వుచు మదాలసా ! ఇట్టిపేరు పెట్టితి వేమి ? అలర్కుఁడన నర్థమేమియో చెప్పుమని పరిహాసముసేసెను. అప్పుడు మదాలస రాజా ! నేనుబెట్టినపేరు సార్థమైనదికాదు. వ్యవహారికనామమున కర్థమేమియుండును ? మీరుపెట్టినపేరు లపార్థములు. వినుండు. నేనేచెప్పెద. క్రాంతి యనఁగా నొకదేశమునుండి మఱియొక దేశమున కరుగుట. అంతటను నిండియున్న దేహేశ్వరుఁ డొకచోటనుండి మఱియొకచోటున కెట్లుపోవును. కావున నీపేరు నిరర్థకమని నాయభిప్రాయము. .సుబాహునామము అమూర్తుఁడైన పురుషున కెట్లుచెల్లును? మూఁడవపుత్రునకు నరిమర్దనుఁడని పేరుపెట్టితిరి. అదియు నిరర్థకమే. వినుండు. మణులనుగ్రుచ్చిన సూత్రమువలె సర్వశరీరములయందు నున్నవాఁ డొక్క పురుషుఁడే. అట్టివానికి శత్రులెవ్వరు? మిత్రులెవ్వరు ?