పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదాలసకథ.

371

యను నామకరణము వ్రాసెను. ఆపేరునకు భృత్యులెల్లఁ బరమానంద భరితులైరి. మదాలస నవ్వుచుఁ బరిహాసముసేసినది. మఱియొకనాఁడు మదాలస బంగరుడోలికలో వెల్లకితలం బండుకొని రోదనము చేయుచున్న బాలకుని జోకొట్టుచు నిట్లు బోధించినది.

తాతా ! నీవు కేవలము పరమాత్మవు. నీకుఁ గల్పనగా నీపేరు పెట్టఁబడినది. పంచభూతాత్మకమైన యీదేహము నీవుకావు. ఎందుల కేడ్చెదవు. నీగుణములన్నియు వికల్ప్యములు. నీయింద్రియము లందు భూతము లావరించియున్నవి. అన్నాంబుపానాదులచే భూతము లెదుగును గాని నీకు వృద్ధిక్షయములు లేవు నీవు కంచుకప్రాయమై నశింపఁబోవుచున్న యీదేహమునందు మమత్వము వహింపకుము. మదమాత్సర్యాది దుర్గుణజనితములగు శుభాశుభరూపములైన కర్మలచే నీకంచుకము నీపైఁ గట్టఁబడినది. తండ్రియనియుఁ దనయుఁడనియు నీవనియు నేననియు భూతసంఘమును మన్నించుచుంటిమి. మూర్ఖుఁడు దుఃఖములఁ బోఁగొట్టుకొనుచు భోగములు సుఖముగలుగఁజేయునని తలంచును. పరమమూర్ఖుఁ డాదుఃఖములనే సుఖములని తలంచును. ఎముకలుగనపఱచుట నవ్వుఅని వర్ణింతురు. కల్మషయుక్తమగువపను బ్రకాశించు కన్నులని పొగడుదురు. దుర్మాస పిండంబులఁ గుచంబులని నుపమానములు గల్పించి స్తుతియింతురు. రతి కాస్పదయగు స్త్రీ నిరయము కాదా ?

శ్లో॥ హాసోస్థిసందర్శనమక్షియుగ్మ మత్యుజ్వలం తత్కలుషం వపాయాః
     కుచాదిపీనం పిశితం ఘనంచ స్థానంర తెః కింనరకోనయోషిత్ ॥

అని యిట్లు మదాలస నిత్యము నబ్బాలకునికి బోధింపుచుండ నతండు పెద్దవాఁడై తదుపదేశ ప్రభావంబున గార్హస్థ్యధర్మ మనుష్టింపక విరక్తుండె తపోవనంబున కరిగెను. మఱికొంతకాలమునకు మదాలస మఱియొక కొమరునిం గనినది. కువలయాశ్వుం డతనికి సుబాహుండని పేరుపెట్టెను. అప్పుడుగూడ నాచేడియ నవ్వినది. పిమ్మట నాబాలుండు