పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/379

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

370

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

ఆవార్తవిని యతం డమృతహ్రదంబున మునిఁగినట్లు పరితుష్టి నొందుచుఁ దటాలునఁబోయి యా యిందువదన చేయిపట్టికొని అన్న న్నా! ప్రాణేశ్వరీ ! నే నింతపరితాపము చెందుచుండ నిజము తెలియఁజేయ కూరకుందువా ? అనిపలుకుచు నక్కునం జేర్చికొని యుపలాలించెను.

తరువాత నాగకాంతలు వచ్చి యచ్చిగురుఁబోఁడిసోయగము జూచి సిగ్గుపడఁజొచ్చిరి. కువలయాశ్వుండు నాగేంద్రుఁడు తననిమిత్తమై పడినయిడుము లుగ్గడించుచు మహాత్మా! పరోపకారపరుఁడవన నిన్నే యనవలయును. నా మొగ మెట్టిదో యెఱుఁగక కుమాళ్లు చెప్పినంతమాత్రముననే పెద్దప్రయత్నము సేసి నాదుఃఖమంతయుఁ బోఁగొట్టితివి. ఎన్ని జన్మములెత్తినను నీఋణము దీర్చికొనఁజాలను. భవదీయపాద సేవకుడనని చెప్పికొనుచుందునని పెద్దగా స్తుతియించి తదనుమతి వడసి భార్యతోఁగూడ భూలోకమునకువచ్చి నిజపురంబు ప్రవేశించి తలిదండ్రులకు మ్రొక్కి మదాలసం జూపుచు జరగినయుదంత మంతయు నెఱింగించెను.

అతనిజననీజనకు లాకథవిని ప్రహర్షవివశమానసులై కోడలిం గౌఁగిలించుకొని వినుతించుచుఁ గుమారు నభినందించుచుఁ బెక్కులుత్సవములు గావించిరి. కువలయాశ్వుండు మదాలసను విడువక క్రీడాశైలములయందు నుద్యానవనములందును సైకతప్రదేశములయందును నామెతో విహరింపుచు మన్మథసామ్రాజ్యపట్టభద్రుఁడై క్రీడింపు చుండెను.

కొంతకాలమునకు శత్రుజిత్తు స్వర్గలోక మలంకరించుటయుఁ బ్రధానులు గువలయాశ్వుని రాజుగాఁజేసిరి. కువలయాశ్వుండు ధర్మంబున రాజ్యంబుగావింపుచుండఁ గొండొక కాలంబునకుఁ దత్పత్ని యంతర్వత్నియై తొలుత మగశిశువుం గనినది.

కువలయాశ్వుఁ డా బాలునకు జాతకర్మానంతరము విక్రాంసి