పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదాలసకథ.

369

యాగాత్రియని యెఱింగియు నింతమోహ మందుచుంటివేమిటికి ? సత్యమైన మదాలస వచ్చినచో నెట్టిముదమందెదవో అనియడిగిన నతం డక్కటా ! నా కట్టిభాగ్యము పట్టునా ? ఇఁక నీజన్మమునకు లేదు. అని యామెవంక యూరక జూచుచుండెను. ఇఁక మాయ నుపసంహరింపనా? అని పలికిన నతండు మహాత్మా ! నామోహము తీరకున్నది. మఱికొంచెముసేపు నిలుపుటకు నీకు శక్తిలేదా? అనిబ్రతిమాలికొనియెను. చూడు చూడుము. ఇఁక రెండుగడియ లాపఁగలను. అనుటయు రాజపుత్రుఁడు మహాత్మా! నీయాతిథ్యమునకు మిక్కిలి సంతసించితిని. ఈబోటి నొక్కమాట నాతో మాటాడింపలేవా? బ్రహ్మకూకటి ముట్టెదనని ప్రార్థించెను.

నాగేంద్రుఁడు నవ్వుచు ముట్టకుండ మాటాడుము. అనుజ్ఞ యిచ్చితినని పలికిన నతండు దాపునకుఁ బోయి కలికీ ! ఒక్క ముద్దుపలుకు పలుకుము. నాదెసజూడక కన్నులు మూసికొనియెదవేమి? తెలిసినది. తెలిసినది. నన్నుఁ గృతఘ్నునిగాఁ దలంచి చూడకుంటివా? అగు నామాట సత్యమే ! నాయసత్యమరణము విని నీవు మృతినొందితివి. నీ సత్యమరణము విని నేను దేహము విడువనైతి. కృతఘ్నుండగానా? అని యూరక యున్మత్తాలాపము లాడుచు మహాత్మా! పన్నగేంద్ర ! నా ప్రియురాలు నాతో మాటాడినదికాదు. నే నేమిచేయుదును. ఇఁక మాయనుపసంహరింతువుకాఁబోలు. అయ్యో ! ఈవిరహ మెట్లుభరించు వాఁడ, శాంబరీమదాలసం జూచినంత నావంత మఱింత పెరిఁగినది. కాని తఱుగలేదు. అని దుఃఖించుచుండెను.

నాగేంద్రుండు మెల్లన నతనిలేవనెత్తి యూఱడించుచు రాజ పుత్రా ! నీవు ప్రాజ్ఞుండవయ్యు నిట్లు పరితపించెద వేమిటికి? వినుము. నీ పరితాపము నాపుత్రు లెఱింగింపఁ దపంబుగావించి మహేశ్వరునివరము వలన నీలలనం బుత్రికగాఁ బడసితి నీ విఁక చింతింపకుము. ఇది మాయా మదాలస కాదు. నీభార్యయే యని యావృత్తాంతమంతయు నెఱింగించెను.