పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

368

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

అశ్వతరుఁడు – బిడ్డలారా ! భూతములతో వియోగమును బొందినవారి నెవ్వరైనఁ దీసికొనిరాఁగలరా? స్వప్నములోఁ గనంబడునట్లుచేయమనినఁ జేయుదు లేక మాయామదాలసం జూపమనినఁ జూపెదను. ఇట్టిప్రజ్ఞ నాకుఁ గలదు.

రాజపుత్రుఁడు — (ఇంచుక సిగ్గుతో) మహాత్మా! నాప్రియురాలిని మాయామయినైనఁ జూపిన మిగుల సంతోషింతునుగదా ? అట్లను గ్రహింపుము.

అశ్వతరుఁడు — వత్సా! మాయామదాలసం జూడ నీకు వేడుక గలదేని యట్లేచూపెదను. అభ్యాగతుండు బాలుండైనను గురువుగాఁ దలంచి పూజింపఁదగినది. అనిపలుకుచు నేవియోమంత్రములు జదివి పుత్రులారా ! లోపలికిఁబోయి మదాలసం దీసికొనిరండు. పొండని పలికి యామె నందు రప్పించి రాజపుత్రునకుం జూపుచు నిది నీభార్యయగు మదాలస యగునా కాదా? యని యడిగెను.

అతం డామెంజూచి మోహ మాపఁజాలక సిగ్గువిడిచి హా ! ప్రేయసీ ! హా ! ప్రేయసీ ! అని దుఃఖించుచు మీఁదఁబడఁబోయెను. నాగేంద్రుండు ఆఁ! ఆఁ! రాజపుత్రా! ముట్టకుము. ముట్టకుము. ఇది మాయామదాలసయని చెప్పలేదా ? ముట్టినచో నంతర్థానము నొందఁగలదు. అని వారించినఁ గువలయాశ్వుండు తత్పాదమూలంబునంబడి గోలుగోలున నేడువఁదొడంగెను.

అప్పు డామదాలస యిట్లుతలంచెను. ఆహా ! ఈరాజపుత్రునకు నాయందే మోహ మున్నది. ఈపన్న గేంద్రుండు నన్ను మాయామదాలసయని యీయనకుఁ జూపెను. లోకమంతయు మాయగాక సత్య మేమియున్నది. పంచభూతసమ్మేళనమే దేహము. ఆని యాయువతి తలంచుచుండెను.

నాగేంద్రుం డతని లేవనెత్తి రాజపుత్రా ! యీపద్మనేత్ర మా