పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/376

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదాలసకథ.

367

చున్నాఁడు. మాయింట నన్నివస్తువు లున్నవి. ద్రవ్యములేనప్పుడు యాచించుట యుచితముగాని సంపూర్ణముగానున్నప్పుడు ఇమ్మనియడుగుటకు నో రేట్లువచ్చును. మీయనుగ్రహమువలన నా కన్నియుం గలవు నీ పాదదర్శనమైనది. అంతకన్న నాకుఁ గావలసిన దేమియు లేదు.

అశ్వతరుఁడు — వత్సా ! నావలన రత్నాదికము స్వీకరించుట కిష్టము లేకున్నఁ బోనిమ్ము. నీకుఁ బ్రియమైనదేదేని కలిగినచో నడుగుము. ఒసంగెదను.

రాజపుత్రుఁడు - పన్నగేంద్రా ! నా కేకోరికయు లేదు. నీపాదధూళిచే మదీయశిరంబు పవిత్రముచేసితివి. పరిష్వంగసుఖంబు గూర్చితివి. ఇంతకన్న నధిక మేదిగలదు. అయినను గోరమంటివికావున నడిగెద వినుండు. పుణ్యకర్మసంస్కారము నాహృదయము నెడఁబాయకుండునట్లనుగ్రహింపుము. సువర్ణమణివస్తువాహనాద్యైశ్యర్య మంతయు సుకృతసుకృతవృక్షముయొక్క ఫలంబని యెఱుంగనగు.

అశ్వతరుఁడు — వత్సా! నీవనినట్లు సంపదలు పుణ్యఫలములే. నీబుద్ధి యెప్పుడును ధర్మము నాశ్రయించియుండున ట్లనుగ్రహించితి నైనను నీవు మాయింటికివచ్చి మనుష్యలోక దుర్లభమైనవస్తు వేదేని తీసికొనిపోకుండ నరుగుట లెస్సగాద. నీకును బొందశక్యముగాని దేదేని కలిగిన నడుగుము. ఇచ్చెదను.

రాజపుత్రుఁడు - వినమ్రుండై సాభిలాషముగాఁ బన్నగపుత్రుల మొగము జూచుచున్నాఁడు.

నాగకుమారులు - తండ్రీ ! యితనికామ్యము మీరు దీర్పఁదలంచికొంటిరేని మే మెఱింగింతుము వినుండు. ఇతనిప్రియురాలు మహాసాధ్వి మదాలస యితనియసత్యమరణవార్త విని ప్రాణములు వదలినది. అమ్మదవతిం దీసికొనివచ్చినచో నితనికి సంతోషము. మఱియొకవస్తువు వలన నితండు తృప్తిఁబొందఁడు.