పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

364

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

కరిగిరి.

అశ్వతరుండు యథావిధిం బితరుల నారాధించి మదాలసం దలంచుకొని మధ్యమపిండమును భక్షించెను. అంతలోనే తన్ని శ్వాసము నుండి మదాలస యుదయించినది. ఆరహస్య మెవ్వరికిం జెప్పక యశ్వతరుం డామె సంతర్గృహంబునంబెట్టి కాపాడుచుఁ గుమారుల కిట్లనియె.

వత్సలారా ! లోకోపకారియగు నారాజపుత్రు నొకసారి మన నగరమునకుఁ దీసికొనిరండు. తదభీష్టము నెఱవేర్తునని పలికిన సంతసించుచు వారిరువురు వాడుకప్రకారము మఱునాఁ డా రాజధాని కరిగి కువలయాశ్వునితో నాటలాడి యాడి కథాంతరమందు మిత్రమా ! చిరకాలమునుండి మేము మీయింటికి వచ్చుచుంటిమి. నీతో నాడుచుంటిమి. నీ వొక్కసారియు మాయింటికి రావైతివి. తప్పక నేఁడు రమ్మని కోరుచున్నాము. అని ప్రార్థించిన నారాజనందనుం డిట్లనియె.

మిత్రులారా ! నాగేహము మీగేహముగాదా ? ఇందు నాకున్న ధనవాహనవస్త్రాదికములన్నియు మీవే. నన్ను మీయింటికిఁ దీసికొనిపోయి యేమియ్యఁదలఁచికొంటిరో యిందే యీయుఁడు మీవలనఁ గై కొనియెదంగాక. విప్రనందనులారా ! మీకు నాయెడ భేదబుద్ది దలుపవలదు. నాగృహమందు మమత్వము బూనుఁడు. ఎన్నఁడు నిట్టి భేదబుద్ధిలో మాటాడవలదని నాపై నొట్టుపెట్టుచున్నాను. మీకు నాపైఁ గల ప్రేమ యెఱుంగుదును. మఱియు,

శ్లో॥ ఉపచారఃకర్తవ్యోయావద నుత్పన్న సౌహృదా? పురుషాః
     ఉత్పన్నసౌహృదానాముపచారః కైతవం భవతి. ॥

ఎంతవఱకు స్నేహము కలియదో యంతవఱకే యుపచారము. కలిసినపిమ్మటఁ జేయునుపచారము కైతవమగునని యార్యులు సెప్పుదురు. అనిపలికిన విని యించుక ప్రణయకోపము చెందుచు నాగకు