పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/369

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

360

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

పలుకుచు నామండన మందుఁ బారవిడిచి యతఁ డరిగెను.

ఆమాటలు విని యందున్న వారెల్ల హాహాకారము గావింపుచు మూర్ఛవాయిరి. మదాలస భర్త మృతినొందెననువార్త వినుచుండఁగ నే కరవాలఖండితరంభాతరుకాండంబువోలె నేలంబడి యసువులం బాసినది. కువలయాశ్వునితలిదండ్రులు కొంతసేపటికి తెప్పిరిల్లిరి. మదాలస చావువిని మఱియును దుఃఖించుచున్న భార్య నోదార్చుచు శత్రుజిత్తు ఇట్లనియె.

సాధ్వీ ! భూతములయొక్క యనిత్యత దెలిసికొనినఁ గుమారుని నిమిత్తము కోడలినిమిత్తము మనము విచారింపవలసినపనిలేదు. కుమారుఁడు బ్రాహ్మణార్థమై ప్రాణములు వదలెను. కోడలు భర్తనిమిత్తము మేను బాసినది. ఈయిద్దఱిమరణములు స్తోత్రపాత్రములై యున్నవి. క్షత్రియుఁడు సంగరంబునఁ జచ్చుటయు స్త్రీ సహగమనము సేయుటయుఁ గోటియాగములు చేసినకన్న నధికపుణ్యప్రదమని యార్యులు సెప్పుదురు. వారికొఱకు విచారింపఁదగదని ధైర్యము గఱపుచు వారి కూర్ధ్వదైహికక్రియలు నిర్వర్తించి సద్గోష్టితోఁ గాలక్షేపము గావింపుచుండెను,

తాళకేతుండు యమునాజలంబువెడలి యొడ్డున కోదండధారియై, యోరిమితోఁ గాచుచున్న కువలయాశ్వుంజూచి తలయూచుచు నిట్లనియె. రాజపుత్రా ! చిరకాలమునుండి యభిలషించుచున్న కార్యము నెఱవేఱినది. కృతార్ధుండనైతిని నాపని నాకైనది. నీ విఁక నింటికిం బోవచ్చునని పలికిన మహాప్రసాదమని వినయమభినయించుచుఁ గువలయాశ్వుం డశ్వమెక్కి నిజపురంబున కరిగెను. నగరరాజమార్గమునఁ జనుచున్న యతనిం జూచి జనులుకొందఱు మనంబున దుఃఖించుచు మోమున విన్నదనంబు దోఁపఁ దలవంచుకొనిరి. కొందఱు మోలుము వికసింప నొండొరులఁ గౌఁగిలించుకొనుచు సంతోషమును వెలిబుచ్చిరి మఱికొందఱు విస్మయముగాఁ జూచుచుండిరి. కొంద ఱతని మూగికొని వెనువెంట నడుచు