పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదాలసకథ.

359

రాజపుత్రా ! నీవంటిశూరుండు మాకు రక్షకుఁడైయుండఁ దపోవిఘ్న మెట్లగును? లెస్సగా జరగుచున్నది. మఱియు నిన్నొక్కటి యాచించుచున్నవాఁడ లేదనక యిత్తువనియే తలంచెదను. వినుము. నే నొక యజ్ఞము సేయఁదలఁచుకొంటిని. అందులకు ధనము కావలయు. దక్షిణాప్రధానములగు వారుణేష్టులు పెక్కు లాతంత్రమునఁ జేయవలసి యున్నవి. కావున నీమెడనున్న కంఠాభరణము నాకిమ్ము. దాన జన్నము పూర్తియగును. మఱియు నేను జలంబున మునింగి వారుణేష్టులఁ గావించుచుండెద నప్పుడు నీవు తీరమున వసించి దనుజబాధ బొరయకుండఁ గాపాడవలయు నిదియే నాకోరికయని పలికిన సంతసించుచు నారాజ సూనుఁ డోహో ! యిందుల కింతవినయమేల? ఇదిగో కంఠభూషణము గైకొనుఁడని పలుకుచుఁ దీసి వానిచేతంబెట్టి మహాత్మా ! నేను ధనుర్ధరుఁడనై నీయాశ్రమసమీపమున నుండెద. నీవు నిర్భయముగా వరుణు నారాధింపుము. అంతరాయము రాకుండఁ గాపాడెదనని చెప్పెను.

ఆకపటయతి యతఁడు సూచుచుండ జలంబున మునింగి క్రమంబున నవ్వలకుఁజేరి పోయి పోయి తిన్నగా శత్రుజిత్తునొద్దకుఁ బోయి స్త్రీ సమక్షమున నిట్లు తెలియఁజేసెను. నీవు కువలయాశ్వుని తండ్రివేనా ? పాప మతఁడు గుఱ్ఱమెక్కి ఋష్యాశ్రమముల సంచరించుచుండ నొక దానవుం డతనితోఁ బ్రచండభండనము గావించి పలాయితుంజేసి వెనువెంటఁ దఱిమికొనివచ్చి నాయాశ్రమము నెదుట నేను సూచుచుండ శూలముపుచ్చుకొని కడుపులో గ్రుచ్చి గతాసుం గావించెను. హరిహరీ ! మీ కెట్టిదారుణపువార్త చెప్పుచుంటిని !

ప్రాణోత్క్రమణసమయంబున నీకుమారుఁడు నా కీకంఠాభరణ మిచ్చెను. అతనిహయము నాదానవుఁడు తీసికొనిపోయెను. అందున్న తాపసు లతని దేహసంస్కారమును గావించిరి. సమలోష్టకాంచనులమగు మా కీయాభరణముతోఁ బనియేమిటికి ? నీవు గైకొనుము. అని