పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

358

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

పిమ్మట నాకొమ్మను హయమ్ముపై నెక్కించుకొని రయమ్మున నతండు భూలోకంబున కరుగుచుండం దెలిసికొని చతురంగబలములతోఁ బాతాళ కేతుఁ డడ్డగించెను నిలు నిలుమని పలుకుచుఁ దదనుచరులు శరవర్షము గురిపించిరి. గాజపుత్రుఁడు నవ్వుచు నారిసంధించి త్వష్టాస్త్రము వారిపైఁ బ్రయోగించుటయుఁ గాపిలతేజంబు సగరపుత్రులవలె నయ్యస్త్రంబు పాతాళ కేతునితోఁ గూడ రక్కసుల నెల్ల భస్మముగావించినది.

తరువాతఁ గువలయాశ్వుండు నిర్భయముగాఁ దనపురంబున కరిగి జరిగినకథయంతయుఁ జెప్పి మదాలసం జూపెను శత్రుజిత్తు పుత్రుం గౌఁగిలించుకొని మూర్ధాఘ్రాణము గావించుచు మిక్కిలి సంతోషించెను.

కువలయాశ్వుండు ఉద్యానవనపర్వతసానువులయందు భార్యతో విహరించుచు గొంతకాలము సుఖముగా వెళ్లించెను.

కొన్నిదినము లరిగినతరువాత నొకనాఁడు శత్రుజిత్తు పుత్రుఁ గాంచి వత్సా! నీవు ప్రతిదినము నీయశ్వమెక్కి యరుగుచు బ్రాహ్మణుల రక్షింపవలయును. తపోధనబాధకుల వెదకి పరిభవింప వలయును. దుర్బుద్ధులగురక్కసు లక్కడక్కడ డాగియుందురు. వారిబాధ లేకుండఁ గాపాడుమని యుపదేశించిన సంతసించుచుఁ గువలయాశ్వుం డాయశ్వ మెక్కి యనుదినము పూర్వాహ్ణమున భూమిదిరిగివచ్చి తండ్రికి నమస్కరించుచు మిగిలినవేళలయందు మదాలసతోఁ గ్రీడింపుచుండెను.

పాతాళకేతునితమ్ముఁడు తాళకేతుఁడనువాఁడు కడుమాయావి. యమునాతీరంబున నొకయాశ్రమము గల్పించుకొని యందు ముని వేషము వైచికొని తపము సేయుచున్నట్లభినయించుచుండెను. ఒక నాఁడు రాజపుత్రుఁడు ఋష్యాశ్రమములఁ దిరుగుచు నతనియొద్దకుఁ బోయి మహర్షి యనుకొని నమస్కరించుచు మహాత్మా ! మీకు రాక్షసబాధ యేమియును లేదుగదా ! నిర్విఘ్నముగాఁ దపంబు సాగుచున్నదియా ? అని యడిగిన నక్కపటాత్ముండు మౌనముద్ర విడిచి యిట్లనియె.