పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదాలసకథ.

357

మోహవివశయైనది. నీ వెవ్వఁడవు ? నీవృత్తాంతము చెప్పుమని యడిగిన నతం డిట్లనియె.

కాంచనగాత్రీ ! నేను శత్రుజిత్తను ధాత్రీపతి పుత్రుండ. నాపేరు కువలయాశ్వుఁ డందురు. వరాహరూపము ధరించి గాలవమహర్షిని భయపెట్టుచున్న రాక్షసుం దరిమికొనివచ్చితిని. వాఁడు గోతిలోఁబడి యదృశ్యుఁడయ్యెను. విడువక వానివెంట వచ్చుటచే నా కీలోకము మీరునుఁ గనంబడితిరని తనవృత్తాంత మెఱింగించెను.

ఆకథవిని కుండల ఓహో ! నీవు భూమండలాఖండలుఁడవగు కువలయాశ్వుఁడవా ? అందులకే నిర్దుష్టమగు మదాలసహృదయము నిన్నుఁ జూచి చెదరినది. నిన్నే పెండ్లియాడుమని సురభి యెఱింగించినది. తద్వచనమున కన్యథాత్వము గలుగునా ? నీవు దీనిం బరిగ్రహింపుము. ఇది దేవప్రోక్తము. అని పలుకుచుఁ గులుకుచున్న యావధూవరులకు గాంధర్వవిధానంబునఁ బాణిగ్రహణ మహోత్సవము జరపినది.

మఱియుఁ గుండల తపోవనంబున కరుగుచు మదాలసహస్తం బతనిహస్తంబునం బెట్టి యిట్లుపన్యసించినది. రాజపుత్రా ! అమితప్రజ్ఞ గల పురుషులుగూడ నీకుఁ జెప్ప నేరరనుచో నాఁడుదాన నామాటల యం దేమిసార ముండెడిని? అయినను నాకు నీకోకస్తనియందుఁగల ప్రీతియే యిట్లు చెప్పుటకు నన్నుఁ బ్రోత్సాహపఱచుచున్నది. పతిచేత సర్వదా భరింపఁబడుచుండుటచే భార్య యనంబడుచున్నది. ధర్మార్థ కామసిద్ధికి భార్య భర్తకు సహాయురాలగును. భార్యావిహీనుఁడు . పురుషార్థములఁ బొందనేరఁడు. భార్యాభర్తలు పరస్పరానురాగయుక్తులై రేని అదియే ధర్మార్థకామముల సంఘటనము. దేవతాతిథిభృత్యవర్గంబుల మన్నించుటకు భార్యయే ముఖ్యము. ఈమె కడుముద్దరాలు. పెద్దలకడ మసలి యెఱుంగదు. ఈముద్దియం దిద్దుకొని యెల్లప్రొద్దుల విడువక తద్దయుంబ్రీతిఁ జూచుచుండుము. అని యుపదేశించి కుండల యేగినది.