పుట:Kaseemajilee Kathalu 8 Part Madhira Subbanna Deekshitulu 1937 415 P.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

356

కాశీమజిలీకథలు - ఎనిమిదవభాగము.

నీ వెవ్వతెవు ? ఈపుర మెవ్వరిది ? నీపేరేమి ? అని యడిగిన నప్పడఁతి యేమియు మాటాడక యామేడలోనికిఁ బోయినది.

అతం డాగుఱ్ఱమునుదిగి దాని నొకచోటఁ గట్టిపెట్టి తానుగూడ నాచేడియవెంట నామేడ యెక్కెను. ఆసౌధాంతరమున రత్న పర్యంకమునఁ బండుకొనియున్న యొకచిన్నది యతనికన్నులం బడినది రసాతల దేవతయోయనఁ బ్రకాశించుచున్న యాసుందరింజూచి రాజనందనుఁడు డెందము కందర్పభల్లముల కెల్లయై పొరటిల్లఁ బరవశుండయ్యెను.

అభినవమన్మధుండనందగు నృపనందనుని యందముజూచి యట్టె లేచి యాచిగురుఁబోఁడి చిత్తవిభ్రమము నొందినది. లజ్జావిస్మయలోలములగు చూపులచే నతనిఁ జూచుచు నాహా! ఈ సుకుమారుఁడు మరుఁడా ? పురందరకుమారుఁడా'! విద్యాధరుఁడా ? గంధర్వుఁడా? కిన్నరుఁడా? కృతపుణ్యరతియగు నరుఁడా? అని యాలోచించుచు నిట్టూర్పు నిగుడించుచు కామశరాహతచిత్తయై మూర్ఛవోయినది.

బాలా ! వెఱవకుము వెఱవకుము. అనిపలుకుచుఁ దొలుత నతని చేతఁ జూడఁబడినపడఁతుక తాళవృంతముబూని విసరుచుండెను. రాజపుత్రుఁడు మీరెవ్వరు ? ఈనగర మెవ్వరిది ? ఒంటిగా నిందుంటిరేల ? అనియడిగిన సఖురా లిట్లనియె.

మహాభాగ ! ఈగజయాన విశ్వావసుండను గంధర్వరాజు కూఁతురు. దీనిపేరు మదాలస. ఈయలసగమన యుద్యానవనములో విహరింపుచుండఁ బాతాళ కేతుండను దానవుఁ డీమానిని నెత్తుకొనివచ్చి యిందు దాచెను. రాఁబోవు త్రయోదశినాఁడు వాఁడు ఈచేడియం బెండ్లియాడ మహూర్త ముంచుకొనియెను. ఆవార్తవిని యీకార్తస్వరగాత్రి యాత్రము నొందుచు మరణప్రయత్నము గావింపుచుండ సురభి యరుదెంచి యాయుద్యమము వారించుచుఁ గొన్నిరహస్యము లెఱింగించినది. నే నీమెసఖురాలను. నాపేరు కుండలయండ్రు. ఈమె నిన్నుఁజూచి